సిగ్మా ప్లాన్ సెట్టయ్యింది.. వచ్చేది ఎప్పుడంటే..
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ 'సిగ్మా' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ 'సిగ్మా' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఆరోజు గాంధీ జయంతి హాలిడే కావడంతో పాటు, ఆ వెంటనే లాంగ్ వీకెండ్ రావడం ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసొచ్చే విషయం.
స్టార్ హీరో, సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అయితే తొలి సినిమా కదా అని ఒక చిన్న కథతో సేఫ్ గేమ్ ఆడకుండా, లైకా ప్రొడక్షన్స్ లాంటి బడా బ్యానర్ లో ఏకంగా ఒక యాక్షన్ అడ్వెంచర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సెటప్ చూస్తుంటే జేసన్ తన మొదటి అడుగు గట్టిగానే వేస్తున్నట్లు అర్థమవుతోంది.
డేట్ అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ లో సందీప్ లుక్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ తో పాటు రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ప్రమోషన్స్ విషయంలో టీమ్ మళ్లీ మొదటి నుంచి కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒక బేస్ అయితే క్రియేట్ అయింది. ఇందులో కాస్టింగ్ కూడా కాస్త డిఫరెంట్ గానే సెట్ చేసుకున్నారు.
సందీప్ కి జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్ లాంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా రాజు సుందరం పాత్ర చాలా డిఫరెంట్ ఉంటుందని టాక్. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, కృష్ణన్ వసంత్ కెమెరామెన్ గా వర్క్ చేశారు. ఈ సినిమాకు మెయిన్ గా ఈ ఇద్దరి వర్క్ హైలెట్ కానుంది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.
రిలీజ్ కు ఇంకా నెలన్నర సమయం ఉండటంతో ప్రమోషన్స్ ను మరింత స్పీడప్ చేయడానికి టీమ్ ప్లాన్ చేసుకుంటోంది. రిలీజ్ టైమ్ లో సెలవులు దొరికాయి కాబట్టి ఓపెనింగ్స్ కు పెద్దగా ఢోకా ఉండదు. కానీ ఆ తర్వాత వీకెండ్ ను పూర్తిగా వాడుకోవాలంటే కంటెంట్ లో దమ్ముండాల్సిందే. ఇటు సందీప్ కిషన్ కు కూడా సిగ్మా ఒక రెగ్యులర్ ప్రాజెక్ట్ కాదు. ఒక కొత్త డైరెక్టర్, దానికి తోడు లైకా లాంటి నిర్మాణ సంస్థ తోడవడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. యాక్షన్ అడ్వెంచర్ సెటప్ లో జేసన్ తన టేకింగ్ తో ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.