ట్రైలర్.. మోసపోయిన 'గరివిడి లక్ష్మి కథ'
కథ విషయానికి వస్తే చదువు రాకపోయినా విన్నది విన్నట్లుగా అద్భుతంగా పాడే టాలెంట్ ఉన్న పల్లెటూరి అమ్మాయి లక్ష్మి.
అక్టోబర్ 17న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గరివిడి లక్ష్మి. ఉత్తరాంధ్రకు చెందిన ఫేమస్ బుర్రకథ కళాకారిణి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఆనంది మెయిన్ లీడ్ చేసిన ఈ సినిమాకు గౌరీ నాయుడు జమ్ము దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే ఒక స్వచ్ఛమైన పల్లెటూరి కథను, టాలెంట్ ను వాడుకుని కొందరు చేసిన మోసాన్ని చాలా రా గా చూపించినట్లు అర్థమవుతోంది.
కథ విషయానికి వస్తే చదువు రాకపోయినా విన్నది విన్నట్లుగా అద్భుతంగా పాడే టాలెంట్ ఉన్న పల్లెటూరి అమ్మాయి లక్ష్మి. ఆమె గొంతులో ఉన్న మ్యాజిక్ నచ్చి ఊర్లో బుర్రకథలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె వాయిస్ నచ్చిన కొందరు టౌన్ నుంచి వచ్చి రికార్డింగ్ చేస్తారు. తీరా ఆమె పాడిన పాటలతో క్యాసెట్లు రిలీజ్ చేసి సినిమాల్లో వాడుకుని లాభాలు సంపాదించిన ఇండస్ట్రీ వాళ్లు కనీసం ఆమెకు ఆ విషయం కూడా చెప్పకుండా ఎలా మోసం చేశారనేదే ఈ సినిమా అసలు పాయింట్ లా కనిపిస్తోంది.
గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది పర్ఫార్మెన్స్ ట్రైలర్ కు అసలైన హైలైట్. ఉత్తరాంధ్ర యాస మాట్లాడుతూ అమాయకత్వం కలబోసిన జానపద కళాకారిణిగా ఆమె లుక్, యాక్టింగ్ చాలా న్యాచురల్ గా సెట్ అయ్యాయి. ఇక ఆమెకు సపోర్ట్ చేస్తూ జనం మెచ్చే కథలు వాళ్ల మధ్యే ఉన్నాయని చెప్పి బుర్రకథల ట్రూప్ పెట్టించే పాత్రలో రాగ్ మయూర్ ఆకట్టుకున్నాడు. వీళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
సినిమాలో డైలాగ్స్ కూడా కాన్ఫ్లిక్ట్ ను స్ట్రాంగ్ గా ఎలివేట్ చేస్తున్నాయి. అందరికీ నీ పాట కావాలి కానీ నువ్వు అక్కర్లేదు అని చెప్పే డైలాగ్ ఆర్టిస్టుల పట్ల కొందరి మైండ్ సెట్ ను చూపిస్తోంది. అలానే చివర్లో నరేష్ పాత్ర చెప్పిన డైలాగ్ మరింత ఆలోచింపజేసేలా ఉంది. నీది కానిది నువ్వు అడగొద్దు, నీదైంది నువ్వు వదలద్దు అంటూ హక్కుల కోసం చేసే పోరాటాన్ని సూచిస్తూ ట్రైలర్ ను ముగించిన తీరు సినిమాపై మంచి క్యూరియాసిటీ పెంచుతోంది.
టెక్నికల్ గా చూసుకుంటే డైరెక్టర్ ఉత్తరాంధ్ర నేటివిటీని తెరపై చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ జె. ఆదిత్య కెమెరా వర్క్ పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇక ఈ మ్యూజికల్ డ్రామాకు చరణ్ అర్జున్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నల్ల జీలకర మొగ్గ లాంటి జానపద పాటలు ప్రాణం పోశాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి.
గరివిడి లక్ష్మి ట్రైలర్ ఒక న్యాచురల్ బయోపిక్ లా హైలెట్ అయ్యింది. అతిగా ఎలివేషన్స్ లేకుండా ఒక పల్లెటూరి కళాకారిణి ఎదిగిన తీరు, ఎదుర్కొన్న కష్టాలను బ్యాలెన్స్డ్ గా చూపించారు. గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తున్న ఈ రూటెడ్ డ్రామా కంటెంట్ పరంగా ఆడియన్స్ కు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది.