తెలుగు సినిమాకు అరుదైన కళాత్మక బాటలు వేసిన లెజెండ‌రీ నిర్మాత

ఆ తర్వాతి చిత్రంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన `శంకరాభరణం` తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లింది.

Update: 2026-10-05 16:30 GMT

నేడు మన దర్శకనిర్మాతలు మంచి కథా బలం వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయని చెబుతుంటారు. అయితే ఈ విధానానికి టాలీవుడ్ తొలి నాళ్లలోనే పునాదులు వేసిన అరుదైన నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు పేరు చరిత్రలో సుస్థిరమైంది. శంకరాభరణం, సాగరసంగమం, స్వయంకృషి, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు, సితార, సీతాకోకచిలుక వంటి కళాత్మక దృశ్య కావ్యాలను ఆయన ప్రపంచానికి అందించారు. కెరీర్‌లో అన్నీ ఆణిముత్యాల లాంటి చిత్రాలనే ఆయన నిర్మించారు.

కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉండటంతో నటనపై మక్కువ పెంచుకుని ఆయన మద్రాస్ రైలెక్కినా అక్కడ ఆరంభంలో నిరాశే మిగిలింది. చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నాచితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ అనేక కష్టాలు పడ్డారు. ఆ తర్వాత 1976లో మిత్రుల ప్రోత్సాహంతో `సిరిసిరిమువ్వ` చిత్రానికి నిర్వహణ బాధ్యతలు వహించి మంచి విజయం సాధించారు. ఆ ఉత్సాహంతోనే `పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్` సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా `తాయారమ్మ బంగారయ్య`ను నిర్మించారు.

ఆ తర్వాతి చిత్రంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన `శంకరాభరణం` తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లింది. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్టమొదటి చిత్రంగా ఇది నిలిచింది. అలాగే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సీతాకోకచిలుక, కమలహాసన్ - విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన `సాగరసంగమం` ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వంశీ దర్శకత్వంలో వచ్చిన `సితార` చిత్రం కూడా జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపును దక్కించుకుంది.

ఇక కె. విశ్వనాథ్, కమలహాసన్, రాధిక కలయికలో వచ్చిన `స్వాతిముత్యం` అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. జాతీయ అవార్డుతో పాటు బంగారు నందిని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు భారత్ తరఫున ఎంపికైన మొదటి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవితో సాధారణ చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రలో `స్వయంకృషి` తీయడం ఆయన గొప్ప సాహసం. ఆ తర్వాత వచ్చిన `ఆపద్బాంధవుడు` కూడా చిరంజీవి నటనకు మరో చక్కని ఉదాహరణగా నిలిచింది.

ఇన్ని అద్భుతమైన చిత్రాలు అందించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుకు ప్రభుత్వాల నుంచి తగిన గుర్తింపు లభించలేదనేది సినీ అభిమానుల పెద్ద నిరాశ. పద్మ అవార్డులలో గాని, రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డుకి గాని ఆయన అన్ని విధాలా అర్హులు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆయనకు తగిన గుర్తింపునిచ్చి గౌరవిస్తాయని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. వర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు మ‌రోసారి ఆయ‌న రూప‌క‌ల్ప‌న‌లోని క‌ళాత్మ‌క చిత్రాల‌ను గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News