సరిహద్దులు దాటిన 'శివ' మేజిక్.. జపాన్ గడ్డపై కల్ట్ క్లాసిక్ సంచలనం!

తాజాగా ఈ సినిమా జపాన్ లో రిలీజ్ అయింది. అక్కడా కింగ్ నాగార్జునను స్థానిక అభిమానులు ఎంతో ప్రేమగా `నాగ్ సామా` అని సంబోధిస్తూ బ్రహ్మరథం పట్టడం చర్చనీయాంశంగా మారింది.

Update: 2026-10-05 17:10 GMT

భారతీయ సినీ చరిత్రలో `శివ` ఒక ట్రెండ్‌సెట్టర్. టాలీవుడ్‌లో టేకింగ్, సౌండ్ డిజైనింగ్, యాక్షన్ సన్నివేశాల శైలిని పూర్తిగా మార్చేసి కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం విడుదలై 37 ఏళ్లు పూర్తయినా ఆ క్రేజ్ ఇప్ప‌టికీ ప‌దిలమే.

తాజాగా ఈ సినిమా జపాన్ లో రిలీజ్ అయింది. అక్కడా కింగ్ నాగార్జునను స్థానిక అభిమానులు ఎంతో ప్రేమగా `నాగ్ సామా` అని సంబోధిస్తూ బ్రహ్మరథం పట్టడం చర్చనీయాంశంగా మారింది. జపనీస్ సంస్కృతిలో గౌరవనీయులైన వ్యక్తులను `సామా` అని పిలుస్తారు. అటువంటి గౌరవం నాగార్జునకు దక్కడం విశేషం.

సాధారణంగా జపాన్‌లో రజినీకాంత్, ప్ర‌భాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లాంటి మాస్ హీరోల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ ఊహించని విధంగా క్లాసిక్ క్రైమ్ యాక్షన్ డ్రామా `శివ` చిత్రానికి.. అందులో నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్‌కు జపాన్ ఆడియన్స్ ఫిదా అవ్వడం ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. 80ల నాటి భారతీయ సినిమా అయినా? నాగార్జున హెయిర్‌స్టైల్, క్యాజువల్ లుక్స్, ఐకానిక్ చైన్ స్నాచింగ్ సీన్స్ ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా ఎంతో కూల్ గా ఉన్నాయని జపాన్ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జపనీస్ అభిమానులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు `శివ` ని ఎంత గొప్ప చిత్రమో స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమాను ఒకసారి కాదు.. రెండు, మూడు, నాలుగు సార్లు చూసినా? మళ్లీ చూడాలనిపిస్తోందని కొందరు జ‌పాన్ వాసులు వ్యాఖ్యానించారు. `37 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అయినా? నేటి ట్రెండ్‌కు ఏమాత్రం పాతబడినట్లు అనిపించదు. చాలా ఫ్రెష్‌గా ఉంద‌ని కొనియాడారు. సాంకేతికంగా భారతీయ సినిమా ఎంత ముందుకు వెళ్లినా? `శివ`లో ఉన్న రా అండ్ రస్టిక్ ఫీల్ నేటి గ్లోబల్ ఆడియన్స్‌ను సైతం కట్టిపడేస్తుందనడానికి నిదర్శనం.

ఈ చిత్రాన్ని 4K డాల్బీ అట్మాస్ విజువల్స్ అండ్ సౌండ్‌తో రీ-రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లోనే సౌండ్ ఇంజనీరింగ్‌లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం నేటి ఆధునిక 4K ఫార్మాట్‌లో జపాన్ స్క్రీన్స్ పై ప్రదర్శిత మవ్వడంతో అక్కడి ఆడియన్స్‌కు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించింది. కాలం మారినా? భాష మారినా? మంచి కంటెంట్ ఉన్న సినిమా సరిహద్దులు దాటి ఎలా అలరిస్తుందో? `శివ‌` నిరూపించింది.

దక్షిణాది సినిమాలకు జపాన్ ప్రధాన మార్కెట్‌గా మారుతున్న తరుణంలో పాన్-ఇండియా సినిమాలే కాకుండా భారతీయ సినీ ప్రస్థానాన్ని మార్చిన ఇలాంటి క్లాసిక్స్ కూడా అక్కడి జనులను ఆకట్టుకోవడం ఇండస్ట్రీకి శుభపరిణామం. అక్టోబర్ 5 1989న విడుదలైన `శివ` అప్పట్లో ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో? సరిగ్గా ముప్పై ఏడేళ్ల తర్వాత జపాన్ గడ్డపై కూడా అదే స్థాయి లెగసీని కొనసాగిస్తూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.

మొత్తానికి `నాగ్ సామా`గా జపాన్ ప్రజల హృదయాల్లో నాగార్జున సాధించిన ఈ గుర్తింపు టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరోసారి నిలబెట్టింది. దశాబ్దాలు గడిచినా `శివ` సృష్టించిన ఇంపాక్ట్ తగ్గకపోవడం.. ఆ సైకిల్ చైన్ శబ్దం ఇప్పటికీ గ్లోబల్ వైడ్‌గా మోగ‌డం తెలుగు సినీ ప్రియులందరికీ గర్వకారణం.



Tags:    

Similar News