ఆర్యన్ ఖాన్ సక్సెస్.. జాసన్ సంజయ్ ఫెయిల్యూర్ రహస్యం ఇదేనా!
స్టార్ కిడ్స్ ఎంట్రీ అంటేనే భారీ అంచనాలు, విమర్శలు సర్వసాధారణం. ఈ ఒత్తిడిని ముందే గమనించినఆర్యన్ ఖాన్ అత్యంత సురక్షితమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
తండ్రుల అడుగుజాడల్లో నడవాలని భావించే స్టార్ కిడ్స్ ప్రయాణం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే కెమెరా ముందు నిలబడి హీరోలుగా మారే పాత పద్ధతికి స్వస్తి పలికి కెమెరా వెనుక నిలబడి దర్శకులుగా అరంగేట్రం చేయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు ప్రముఖుల వారసులు. దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్, బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. తండ్రుల లెగసీని మోస్తూ దర్శకులుగా మారిన యువ కెరటాలలో అసలు విజేత ఎవరు? ఇద్దరి మధ్య జరుగుతున్న చర్చ ఎటు వైపు వెళుతోంది? అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
స్టార్ కిడ్స్ ఎంట్రీ అంటేనే భారీ అంచనాలు, విమర్శలు సర్వసాధారణం. ఈ ఒత్తిడిని ముందే గమనించినఆర్యన్ ఖాన్ అత్యంత సురక్షితమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. నేరుగా థియేటర్లలో బాక్సాఫీస్ పరీక్షను ఎదుర్కొనే బదులు నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. `బాడ్స్ ఆఫ్ బాలీవుడ్`పేరుతో వచ్చిన ఈ సిరీస్ కొన్ని లోపాలున్నా? ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మాత్రం సఫలమైంది. ఇండస్ట్రీ లోపలి కహానీలను కళ్లకు కట్టినట్లు చూపించడంతో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
జాసన్ సంజయ్ మాత్రం ఓటీటీ రూట్ కాకుండా నేరుగా థియేట్రికల్ డెబ్యూ వైపే మొగ్గు చూపాడు. భారీ అంచనాల మధ్య గత వారం థియేటర్లలో విడుదలైన అతని తొలి చిత్రం `సిగ్మా` బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. సినిమాలో కొత్త ఆలోచనలు కరువవడం, పేలవమైన స్క్రీన్ ప్లే , బలహీనమైన దర్శకత్వ ప్రతిభ బయటపడటంతో క్రిటిక్స్ సహా సాధారణ ప్రేక్షకులు సైతం ఈ చిత్రాన్ని తిరస్కరించారు. తండ్రి ఇమేజ్‌కు తగినట్లుగా భారీ మాస్ అంచనాలను అందుకోవడంలో జాసన్ పూర్తిగా విఫలమయ్యాడు.
ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే ప్రస్తుతానికి ఆర్యన్ ఖాన్ వ్యూహాత్మకంగా విజయం సాధించాడని చెప్పొచ్చు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అనేది కంటెంట్‌కు ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుంది. తద్వారా కొత్త దర్శకులు తప్పులను సరిదిద్దు కోవడానికి ..ప్రయోగాలు చేయడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ థియేటర్ అనేది వేరు. అక్కడ తొలి రోజే ఆడియన్స్ నుంచి వచ్చే తీర్పు కఠినంగా ఉంటుంది. జాసన్ సంజయ్ నేరుగా ఆ పెద్ద అగ్నిపరీక్షలోకి దూకి దెబ్బతింటే ఆర్యన్ ఖాన్ మాత్రం ప్లాన్డ్ రూట్‌లో సక్సెస్ కొట్టాడు.
ఆర్యన్ ఖాన్ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించినంత మాత్రాన అతను పరిపూర్ణ దర్శకుడిగా నిరూపించుకున్నట్లు కాదు. డిజిటల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడం వేరు. థియేటర్లలో ప్రేక్షకులను సీట్లకు కట్టేయడం వేరు. సినిమాను బిగ్ స్క్రీన్ కోసం రూపొందించినప్పుడే ఆ డైరెక్టర్ అసలు సత్తా ఏంటో? బయటపడుతుంది. ఆర్యన్ ఖాన్ నిజమైన సత్తా చాటాలంటే రాబోయే రోజుల్లో కచ్చితంగా థియేట్రికల్ సినిమా తీయాల్సిందే.
అంతిమంగా షారూఖ్ ఖాన్ - విజయ్ కుమారుల డెబ్యూ ప్రయత్నాలు భిన్నమైన ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతానికి ఖాన్ కుమారుడిదే పైచేయి అయినా? ఇది కేవలం ఆరంభం మాత్రమే. తండ్రుల నీడను దాటి స్వయంశక్తితో నిలదొక్కుకోవడానికి యువ దర్శకులు ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది. ఓటీటీ అయినా? థియేటర్ అయినా? ప్రేక్షకులు కోరుకునేది మంచి వినోదాన్ని మాత్రమే. ఆ దిశగా యంగ్ టాలెంట్స్ తప్పులను సరిది ద్దుకుని ముందుకు సాగుతారని ఆశీద్దాం.