టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లను వెనక్కి నెట్టిన ఇండియన్ స్టార్!
భారతదేశంలో అద్భుతమైన ఓపెనింగ్‌ను రాబట్టిన ఈ చిత్రం తొలి రోజే 62 కోట్ల నెట్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
అజయ్ దేవ్‌గణ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ `దృశ్యం 3` బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇండియన్ సినిమా సత్తాను గ్లోబల్ లెవెల్‌లో సత్తా చాటుతోంది. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఓపెనింగ్ వీకెండ్‌లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలవడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. హాలీవుడ్ దిగ్గజాలు టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ వంటి గ్లోబల్ సూపర్ స్టార్ల సినిమాలను సైతం వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలో గ్లోబల్ బాక్సాఫీస్ క్లాష్‌లో ఈ స్థాయి రికార్డ్ నమోదు కావడం ఇదే తొలిసారి.
భారతదేశంలో అద్భుతమైన ఓపెనింగ్‌ను రాబట్టిన ఈ చిత్రం తొలి రోజే 62 కోట్ల నెట్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వీకెండ్ ముగిసేసరికి ఏకంగా 176.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక నార్త్ అమెరికా , ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి ఆదరణ దక్కిచుకుంది. బాక్సాఫీస్ రేసులో టామ్ క్రూజ్ నటించిన `డిగ్గర్` సినిమాతో పాటు, బ్రాడ్ పిట్ నటించిన `హార్ట్ ఆఫ్ ది బీస్ట్` వంటి పెద్ద హాలీవుడ్ చిత్రాల కలెక్షన్లను `దృశ్యం 3` సులభంగా దాటేసింది. ఆన్ హాథవె, డాకోటా జాన్సన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఎరాటిక్ థ్రిల్లర్ `వెరిటీ` ($62.6 మిలియన్లు) మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దృశ్యం కంటే ముందు స్థానంలో నిలిచింది.
అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్, తబు, శ్రియా శరన్, రజత్ కపూర్ తదితరులు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. జైదీప్ అహ్లావత్, ప్రకాష్ రాజ్ వంటి అగ్ర నటులు కొత్తగా చేరడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అక్టోబర్ 2న విడుదలైన చిత్రం ప్రతి క్షణం ఉత్కంఠను పంచుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ఏ స్థాయిలో గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించవచ్చో `దృశ్యం 3` నిరూపించింది. హాలీవుడ్ స్టార్ సినిమాలతో సమానంగా అంతర్జాతీయ స్థాయిలో నంబర్ 2 స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.