నాగవంశీ మరో'సారీ'.. ఈసారి ఏం చెప్పారంటే?
ఒకసారి డేట్ చెప్పడం.. ఆ తర్వాత వాయిదా వేయడం.. మళ్లీ కొత్త డేట్ పై క్లారిటీ లేకపోవడం.. ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47 మూవీ విషయంలో ఇదే జరుగుతోంది.
ఒకసారి డేట్ చెప్పడం.. ఆ తర్వాత వాయిదా వేయడం.. మళ్లీ కొత్త డేట్ పై క్లారిటీ లేకపోవడం.. ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47 మూవీ విషయంలో ఇదే జరుగుతోంది. అక్టోబర్ 9న సినిమా వస్తుందని ఆశించిన వెంకటేష్ అభిమానులకు ఇప్పుడు మరోసారి నిరాశ ఎదురైంది. ఈసారి నిర్మాత నాగవంశీ స్వయంగా సారీ చెబుతూ అసలు కారణాన్ని వివరించారు.
వెంకటేష్ లీడ్ రోల్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47. ఆ సినిమాను అక్టోబర్ 9న విడుదల చేయాలని మూవీ టీమ్ మొదట నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే ఓవర్సీస్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే సినిమా పనులు అనుకున్న సమయానికి పూర్తికాలేదు. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో అక్టోబర్ 9న సినిమాను తీసుకురావడం కష్టమని నిర్మాత నాగవంశీ తెలిపారు.
హడావుడిగా సినిమాను విడుదల చేయడం కంటే, పూర్తిగా సిద్ధమైన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. "రీసెంట్ గా కచ్చితంగా వస్తుందని చెప్పాను. యూఎస్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ఓవర్సీస్ సెన్సార్ కు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది’" అని నాగవంశీ వివరించారు.
అయితే కావాలంటే పనులు పుష్ చేసి సినిమా విడుదల చేయొచ్చని.. కానీ అలా చేస్తే మొదటి రోజు ప్రేక్షకులతో కలిసి సినిమా చూసే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. అందుకే రిస్క్ తీసుకోకుండా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ఇతర సినిమాలపై కూడా నాగవంశీ స్పందించారు. తమ మూవీ కోసం ఆ తేదీని దృష్టిలో పెట్టుకుని కొన్ని సినిమాలు ప్లాన్ చేసుకున్నాయని.. చివరి నిమిషంలో వాయిదా వేయడంతో వారికి ఇబ్బంది వచ్చిందని చెప్పారు.
అందుకే ఆయా మూవీ టీమ్స్ కు, ముఖ్యంగా వెంకటేశ్ అభిమానులకు సారీ చెబుతున్నానని అన్నారు. అలా అని కొత్త రిలీజ్ డేట్ పై కూడా నాగవంశీ క్లారిటీ ఇవ్వలేదు. అక్టోబర్ 30 అనే తేదీ ప్రచారంలో ఉన్నప్పటికీ అది ఫిక్స్ కాలేదని తెలిపారు. వెంకటేష్ ప్రస్తుతం ఫారిన్ లో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడి సరైన తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. సినిమా కాపీ పూర్తిగా సిద్ధమైన తర్వాతే డేట్ ప్రకటిస్తామన్న నాగవంశీ, ఇంకా కొన్ని పాటలను విడుదల చేయాల్సి ఉందని తెలిపారు.
సినిమా విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే, అంతా సాటిస్ఫై చేసేలా కంటెంట్ రెడీ చేయడంపైనే దృష్టి పెడుతున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నామని నాగవంశీ అన్నారు. అలా అక్టోబర్ 9న వస్తుందని ఫిక్స్ అయిన ఆదర్శ కుటుంబం ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాలి. కానీ డేట్ కంటే ముందుగా సినిమా కాపీ రెడీ కావడమే ముఖ్యమని నాగవంశీ అంటున్నారు.