ఫ్యాన్స్ మీటింగ్స్: బాక్సాఫీస్ భద్రతా లేక పొలిటికల్ అరంగేట్రమా?
తమిళ సినీ పీఠంపై అగ్ర హీరోలు సాధించిన విజయాల వెనుక బలమైన అభిమాన సంఘాల పాత్ర ఎంతో ఉంది.
తమిళ సినీ పీఠంపై అగ్ర హీరోలు సాధించిన విజయాల వెనుక బలమైన అభిమాన సంఘాల పాత్ర ఎంతో ఉంది. ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ నుంచి ఇటీవల తమిళగ వెట్రి కళగం అధినే దళపతి విజయ్ వరకు ప్రతి ఒక్కరూ తమ రాజకీయ ప్రయాణానికి పునాదిగా అభిమాన బలాన్నే వినియోగించుకున్నారు. తాజాగా శివ కార్తికేయన్ కూడా అభిమానులతో సమావేశం అవ్వడం ఆసక్తికరంగా మారింది. అనంతరం అభిమాన సంఘాల మధ్య చర్చలు అంకంతకు ఆసక్తిని పెంచుతున్నాయి.
సాంప్రదాయకంగా ఫ్యాన్స్ క్లబ్‌లు అంటే? సినిమాలు విడుదలైనప్పుడు బ్యానర్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, థియేటర్ల దగ్గర హంగామా చేయడానికే పరిమితమయ్యేవి. కానీ ప్రస్తుత ట్రెండ్‌లో హీరోలు ఈ బలాన్ని క్రమబద్ధమైన సామాజిక సర్వీస్ నెట్‌వర్క్‌లుగా మారుస్తున్నారు. శివకార్తికేయన్ అభిమానులను కేవలం సినిమాలు చూడడానికే కాకుండా స్థానికంగా రక్తదాన శిబిరాలు, నిరుపేద విద్యార్థులకు సాయం, పర్యావరణ పరిరక్షణ వంటి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించడం ఈ మార్పుకు ఓ నిదర్శనం. ఇది కేవలం పబ్లిక్ రిలేషన్స్ స్టంట్ మాత్రమే కాదు. అభిమానులకు సమాజంలో గుర్తింపును, బాధ్యతను తెచ్చిపెడుతోంది.
ఈ ధోరణి తమిళనాడుకే పరిమితం కాలేదు. అప్పుడప్పుడు టాలీవుడ్ హీరోలు కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అవుతుంటారు. హీరో పిలుపునిస్తే కొన్ని గంటల్లోనే క్షేత్రస్థాయిలో వేలమంది అభిమానులు సామాజిక కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యే స్థాయికి ఈ వ్యవస్థ నిర్మాణం జరిగింది. వ్యవస్థీకృత ఫ్యాన్ బేస్ భవిష్యత్తులో రాజకీయాలకు ఉపయోగపడుతుందా? లేదా? అనేది పక్కన పెడితే సమాజంలో శక్తి వంతమైన వాలంటీర్ నెట్‌వర్క్‌గా ఎదుగుతోందన్నది కాదనలేని నిజం.
ఫ్యాన్స్ మీట్స్‌ను పూర్తిగా రాజకీయ ముడిసరుకుగా చూడడం కూడా తొందరపాటే అవుతుంది. విజయ్ లాంటి అగ్ర నటుడు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లడంతో కోలీవుడ్‌లో నంబర్ వన్, నంబర్ టూ స్థానాల కోసం పెద్ద ఖాళీ ఏర్పడింది. బాక్సాఫీస్ మార్కెట్‌ను నిలబెట్టుకోవడానికి, సినిమా వసూళ్లను ఓపెనింగ్ డేస్ నుంచి గ్యారెంటీ చేసుకోవడానికి హీరోలకు ఈ నెట్‌వర్క్ అవసరం. అందుకే శివకార్తికేయన్ వంటి హీరోలు మాస్ అపీల్‌ను, మార్కెట్ స్టెబిలిటీని కాపాడుకోవడానికి అభిమానులను ఒక తాటిపైకి తెస్తున్నారు అనే మాట బలంగా వినిపిస్తోంది.
అయితే ఇక్కడే ఓ చిన్న రాజకీయం దాగి ఉంది. దక్షిణాదిలో ప్రజాదరణ ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు. రాజకీయ నాయకులు పబ్లిక్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న రోజుల్లో హీరోలు సేవా కార్యక్రమాల ద్వారా సామాజిక నాయకులుగా గుర్తింపు పొందుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోయినా? ఈ తరహా ఇమేజ్ బిల్డింగ్ వారికి భవిష్యత్తులో ఎలాంటి సామాజిక, రాజకీయ పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనేంత పెద్ద డిజిటల్ క్యాడర్ బలాన్ని అందిస్తుంది.
అంతిమంగా ప్రస్తుత ఫ్యాన్స్ మీట్స్ రాజకీయ ప్రకటనలకు సూచికలు మాత్రమే కావు. ఇది సినిమాల వ్యాపారాన్ని కాపాడుకోవడానికి..సామాజిక శక్తిగా మలుచుకునే నయా ట్రెండ్‌కు నిదర్శనం. హీరోలు రాజకీయాల్లోకి వస్తారా? లేదా ? అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ అభిమానుల బలంతో వారు సృష్టిస్తున్న సామాజిక ప్రభావం మాత్రం భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నది కాదనలేని నిజం.