ఇలాంటి దర్శకులు మళ్లీ పుట్టరేమో..

సింగీతం శ్రీనివాసరావు సినిమాలు.. టాలీవుడ్ లో ఒక గోల్డెన్ ఎరా అని చెప్పవచ్చు. విశ్వనాథ్ గారు వెళ్ళిపోయినప్పుడే తెలుగు సినిమాకు పెద్ద దిక్కు పోయిన ఫీలింగ్ కలిగింది

Update: 2026-10-05 07:24 GMT

సింగీతం శ్రీనివాసరావు సినిమాలు.. టాలీవుడ్ లో ఒక గోల్డెన్ ఎరా అని చెప్పవచ్చు. విశ్వనాథ్ గారు వెళ్ళిపోయినప్పుడే తెలుగు సినిమాకు పెద్ద దిక్కు పోయిన ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు సింగీతం కూడా లేకపోవడంతో ఇండస్ట్రీ అసలైన మూలస్తంభాలను కోల్పోయినట్లయింది. వీళ్ళిద్దరూ రాబోయే వంద తరాలకు సినిమా ఎలా తీయాలో నేర్పించిన ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పవచ్చు.

కె.విశ్వనాథ్ ట్రాక్ చూస్తే ఆయన మార్క్ ఏంటో క్లియర్ గా తెలుస్తుంది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం లాంటి చిత్రాల్లో మన నేటివిటీని, సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. యాక్షన్, మాస్ మసాలా లేకుండా కేవలం సంగీతం, ఎమోషన్, కుటుంబ బంధాలతోనే థియేటర్లలో జనాన్ని కట్టిపడేశారు. సినిమా చూసి బయటకు వచ్చాక ఆ పాత్రలు మనల్ని వెంటాడేలా చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే జనాలు ఆయనకు కళాతపస్వి అని హృదయాల్లో గుడి కట్టేసుకున్నారు.

సింగీతం రూట్ దీనికి కంప్లీట్ ఆపోజిట్. ఆయన బ్రెయిన్ ఎప్పుడూ పదేళ్లు ముందు ఆలోచించేది. డైలాగుల్లేని పుష్పక విమానం తీసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు. ఆదిత్య 369 లాంటి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను ఆ రోజుల్లోనే ఆడియన్స్ కు అర్థమయ్యేలా చెప్పి బ్లాక్ బస్టర్ కొట్టారు. భైరవద్వీపం లాంటి ఫాంటసీ తీసినా, మయూరి లాంటి బయోపిక్ తీసినా ఆయన పెన్ను నుంచి పుట్టిన మ్యాజిక్ స్క్రీన్ మీద అద్భుతాలు చేసింది. ఒక సినిమాకు ఇంకో సినిమాకు అసలు సంబంధమే లేకుండా ఇన్ని జానర్స్ టచ్ చేసిన ఏకైక ఇండియన్ డైరెక్టర్ ఆయనేమో.

ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య ఒక స్ట్రాంగ్ సిమిలారిటీ ఉంది. స్టార్ హీరోల ఇమేజ్ కు భయపడి వీళ్ళు ఎప్పుడూ తమ కథను మార్చుకోలేదు. ట్రెండ్ కోసం తమ ఒరిజినాలిటీని వదులుకోలేదు. కథే హీరో అని నమ్మారు, ఆ కథను జనాలకు ఎలా కనెక్ట్ చేయాలో పక్కాగా ప్లాన్ చేశారు. హీరో ఎవరైనా సరే సినిమా పోస్టర్ మీద ఈ దర్శకుల పేరు కనిపిస్తే చాలు ఆడియన్స్ కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లేవాళ్లు. డైరెక్టర్ అనే కుర్చీకి అంతటి గౌరవం తీసుకొచ్చారు.

ఇప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియా దాటి గ్లోబల్ లెవెల్ కు వెళ్ళింది. వందల కోట్లు పెట్టి గ్రాఫిక్స్ తో విజువల్ వండర్స్ చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. కానీ సినిమా అయిపోయాక ఇంటికి తీసుకెళ్లే ఒక స్ట్రాంగ్ ఫీల్ మాత్రం ఎక్కడో మిస్ అవుతోంది. ఒక డైరెక్టర్ పేరు చెబితే ఆయన మార్క్ ఇదీ అని కచ్చితంగా చెప్పగలిగే మేకర్స్ ఇప్పుడు కరువయ్యారు.

టెక్నాలజీ లేని రోజుల్లోనే తమ విజన్ తో ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఇండస్ట్రీకి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సింగీతం లాంటి ప్రయోగశీలి, విలువల కోసం పరితపించిన విశ్వనాథ్ లాంటి తపస్వి మళ్లీ ఈ ఇండస్ట్రీలో పుడతారా అంటే కచ్చితంగా లేదనే సమాధానమే వస్తుంది. ఈ లెజెండ్స్ లేని లోటు తెలుగు సినిమాకు ఎప్పటికీ తీరనిదే.

Tags:    

Similar News