టీ20లా అక్షయ్.. టెస్ట్‌లా అమీర్.. మరి బాద్షా!

సినిమాలే కాకుండా, వ్యాపార సామ్రాజ్యం, పెట్టుబడుల ద్వారా షారుఖ్ ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు.

Update: 2026-10-05 14:16 GMT

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటనలోనే కాదు. వ్యాపార రంగంలోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. షారుక్ సంపదకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ జెఎస్ ఖేపర్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోల ఆస్తుల విలువపై సంచలన అంచనాలను వెల్లడించారు. షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ సుమారు 12,000 కోట్ల నుంచి 12,500 కోట్ల వరకు ఉంటుందని ఖేపర్ తెలిపారు. ఈ భారీ సంపద మిగతా స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ , అక్షయ్ కుమార్ ఆస్తులతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.

సినిమాలే కాకుండా, వ్యాపార సామ్రాజ్యం, పెట్టుబడుల ద్వారా షారుఖ్ ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు.

ఇదే సందర్భంగా ఇతర స్టార్ హీరోల పనితీరు , పెట్టుబడుల శైలిని ఆసక్తికరమైన ఉదాహరణలతో విశ్లేషించారు. అక్షయ్ కుమార్ పెట్టుబడుల శైలిని టీ20 ఆటగాడు గా అభివర్ణించారు. అక్షయ్ అన్ని రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెడుతూ నిత్యం బిజీగా ఉంటారని, అందుకే ఆయన మార్కెట్ శైలి టీ20 క్రికెట్‌లా వేగంగా సాగుతుందని తెలిపారు.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పనితీరును టెస్ట్ క్రికెట్ ప్లేయర్ తో పోల్చారు. అమీర్ ప్రతి ప్రాజెక్ట్‌ను ఎంతో నిబ్బరంగా, క్లాస్‌గా చేస్తారని, ఆయన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆ పద్ధతి అలాగే ఉంటుందని విశ్లేషించారు. ఇక సల్మాన్ ఖాన్ ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన శైలిలో భారీగా సంపాదిస్తున్నారని, రియల్ ఎస్టేట్ పరంగా స‌ల్మాన్ కు మిడాస్ టచ్ ఉందని కొనియాడారు.

షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే ఆయన కేవలం నటుడే కాకుండా సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ అని అనలిస్ట్ స్పష్టం చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి వ్యాపారాలు షారుక్ సంపదను అసాధారణ స్థాయికి పెంచాయని వెల్లడించారు. తాను పెట్టిన ప్రతి పెట్టుబడిని లాభసాటిగా మలచుకోవడంలో షారుఖ్ దిట్ట అని ప్రశంసించారు.

మొత్తానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ల సంపద - ఆర్థిక ప్రయాణానికి సంబంధించిన తాజా విశ్లేషణ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తోటి స్టార్ హీరోలందరికంటే ఆర్థికంగా షారుఖ్ ఖాన్ ఎంతో ముందుండటం ఆయన గ్లోబల్ బ్రాండ్ వ్యాల్యూ ఎంత బలమైనదో మరోసారి నిరూపిస్తోంది.

Tags:    

Similar News