సందీప్ కిషన్ 'సిగ్మా'.. సీఎం కొడుకు డెబ్యూ రిలీజ్ ఎప్పుడంటే?

ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సిగ్మాపై ఆసక్తి పెరుగుతోంది.

Update: 2026-05-29 06:06 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సిగ్మాపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఆ సినిమాతో కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండటం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.



 


తాజాగా ఆ మూవీ రిలీజ్ డేట్ ను చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఆ సినిమాను జూలై 31న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఆ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌ గా నటిస్తున్నారు. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ హైప్ క్రియేట్ చేయగా, తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ దాన్ని మరింత పెంచిందని చెప్పాలి. కొత్త పోస్టర్‌ లో సందీప్ కిషన్ మాస్ లుక్‌ లో కనిపించారు. మురికి చొక్కా, భుజంపై రక్తపు మరకలతో ఉన్న గొయ్యి, చుట్టూ ఎగిసిపడుతున్న నిప్పురవ్వలు చూస్తుంటే సినిమాలో ఆయన రోల్ చాలా రఫ్ అండ్ ఇంటెన్స్‌ గా ఉండబోతుందనే క్లియర్ గా తెలుస్తోంది.

యాక్షన్, అడ్వెంచర్, కామెడీ ఎలిమెంట్స్ తో దర్శకుడు జాసన్ సంజయ్ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ ద్వారా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. 'మనం కోల్పోయిన దాన్ని తిరిగి అదే చోట వెతికితే ఏమవుతుంది? దాని కోసం ఎంత మూల్యం చెల్లించాలి?' అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చుట్టూ సినిమా కథ నడుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కేవలం కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా కాకుండా, ఎమోషన్స్ అండ్ మైండ్ గేమ్స్ తో థ్రిల్లర్‌ గా మూవీ ఉండబోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

జాసన్ సంజయ్ విషయానికి వస్తే, ఆయన టొరంటో ఫిల్మ్ స్కూల్‌ లో ఫిల్మ్ మేకింగ్, లండన్‌ లో స్క్రీన్ రైటింగ్ కోర్సు కంప్లీట్ చేశారు. ఇప్పుడు తండ్రిలా యాక్టింగ్ వైపు కాకుండా.. తనదైన కథతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. తొలి సినిమానే భారీ స్థాయిలో తెరకెక్కించడం, అందుకు లైకా ప్రొడక్షన్స్ పూర్తి సహకారం అందించడం కూడా ఆ ప్రాజెక్ట్‌ పై అంచనాలు పెంచుతోంది. ఇక సంగీత దర్శకుడు తమన్ అందిస్తున్న బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో అసెట్ కానుంది. టీజర్‌ లో వినిపించిన మ్యూజిక్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌ తో సినిమాను రూపొందించారని మేకర్స్ చెబుతుండటంతో టెక్నికల్‌ గా కూడా ఆ చిత్రం ప్రత్యేకంగా ఉండబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిగ్మా మూవీ కథ, టీజర్, పోస్టర్లు చూస్తుంటే నార్మల్ కమర్షియల్ మూవీలా కాకుండా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి జేసన్ సంజయ్ డెబ్యూతో ఎలాంటి హిట్ అందుకుంటారో.. సందీప్ కు ఎంతటి సక్సెస్ అందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News