'AMBలోనే బతుకుతున్న'.. సుమంత్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ లో తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్న హీరో సుమంత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.;
టాలీవుడ్ లో తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్న హీరో సుమంత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా తన సోదరి సుప్రియ యార్లగడ్డ నిర్మించిన డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన ఏమన్నారంటే?
సుమంత్ కెరీర్ ప్రారంభం నుంచే భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కమర్షియల్ ఫార్మాట్ కు మాత్రమే పరిమితం కాకుండా, కథాబలం ఉన్న సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తూ తన నటనలో కొత్త కోణాలు చూపిస్తున్నారు.
గత ఏడాది వచ్చిన అనగనగా చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుమంత్, ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన న్యూటన్స్ థర్డ్ లా, మహేంద్రగిరి వారాహి వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా, డెకాయిట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమంత్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
"నేను సినిమాలు చాలా చూస్తాను. నిజానికి నేను ఏఎంబీ థియేటర్ లోనే బతుకుతున్నాను (నవ్వుతూ) షూటింగ్స్ లేనప్పుడు ఎక్కువగా అక్కడే ఉంటాను. సాధారణంగా సినిమా బాగుందని, కలెక్షన్లు వచ్చాయని తెలిసి సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. కానీ అడివి శేష్ సినిమా అయితే మాత్రం అలాంటి అవసరం లేదు. ఆయన పోస్టర్ పై ముఖం కనిపిస్తే చాలు ఒక తెలియని గ్యారెంటీ, నమ్మకం ఉంటుంది" అంటూ సుమంత్ చెప్పిన మాటలు ప్రత్యేకంగా నిలిచాయి.
గత పదేళ్లుగా అడివి శేష్ తన సినిమాల ఎంపికలో చూపుతున్న క్రమశిక్షణ, కథల ఎంపికలో ఉన్న ప్రత్యేకత కారణంగానే నమ్మకం కలుగుతోందని సుమంత్ పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఇక డెకాయిట్ సినిమా విషయానికొస్తే.. ఇది లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కథగా తెరకెక్కింది.
ఇందులో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కథ, స్క్రీన్ ప్లేను అడివి శేష్, దర్శకుడు కలిసి అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాయగా, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి తదితరులు నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న డెకాయిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి. సుమంత్ చేసిన కామెంట్స్ మాత్రం సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.