టాలీవుడ్‌లో డ్యాన్సర్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారా? ఫెడరేషన్ ఏమీ చేయదా?
ఇటీవల అసోసియేషన్ సమావేశంలో కొందరు సభ్యులు సాష్టాంగ నమస్కారం చేసి రాజీనామాలు చేశారంటూ వస్తున్న వార్తలపై సుమలత గట్టి కౌంటర్ ఇచ్చారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ చుట్టూ తిరుగుతున్న వివాదాలపై జానీ మాస్టర్ భార్య సుమలత సంచలన నిజాలను బయటపెట్టారు. సినిమా ఇండస్ట్రీలో రాత్రింబవళ్లు కష్టపడే సాధారణ డ్యాన్సర్ల శ్రమ దోపిడీకి గురవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలు డ్యాన్సర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లను సక్రమంగానే ఇస్తున్నా అసోసియేషన్‌లోని కొంతమంది ఇంచార్జ్‌లు కమిషన్ల రూపంలో ఆ డబ్బును నొక్కేస్తున్నారని సుమలత తీవ్ర ఆరోపణలు చేశారు. మొదటి నుంచి తాము ఈ దోపిడీ విధానంపైనే పోరాడుతున్నామని.. కానీ కొందరు కావాలనే అసలు సమస్యను పక్కదారి పట్టించి లేనిపోని వివాదాలను సృష్టిస్తున్నారని స్పష్టం చేశారు. పేమెంట్ల అక్రమాల గురించిన పూర్తి వివరాలను ఇప్పటికే మీటింగ్‌లో వివరించామని.. తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని సుమలత పేర్కొన్నారు.
ఇటీవల అసోసియేషన్ సమావేశంలో కొందరు సభ్యులు సాష్టాంగ నమస్కారం చేసి రాజీనామాలు చేశారంటూ వస్తున్న వార్తలపై సుమలత గట్టి కౌంటర్ ఇచ్చారు. కేవలం ప్రచారం కోసం చేసే పనులను రాజీనామాలుగా పరిగణించలేమని.. అధికారికంగా రాజీనామా పత్రాలు సమర్పించినప్పుడే దానికి విలువ ఉంటుందని కూడా అన్నారు. తప్పు చేసేవారితో కలిసి పనిచేయడం కంటే..ఆ తప్పును ప్రశ్నిస్తూ పదవుల నుంచి తప్పుకోవడమే తమ నైతిక విధానమని సుమలత స్పష్టం చేశారు. తప్పును సమర్థించడం కూడా తప్పేనని.. తాము ఎవరినీ రాజీనామా చేయమని అడగలేదని...ఒకవేళ వారు స్వచ్ఛందంగా తప్పుకుంటే నిబంధనల ప్రకారం ఆ ఖాళీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఆమె వివరించారు.
ఈ వివాదంలో ఫిల్మ్ ఫెడరేషన్ వ్యవహరిస్తున్న తీరుపై సుమలత తీవ్రమైన ప్రశ్నలు సంధించారు. రాజీనామా చేసినట్లు చెబుతున్న 10 మంది సభ్యులు డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌కు కాకుండా నేరుగా ఫెడరేషన్‌కు లేఖలు ఇవ్వడంపై సుమలత అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఇతర సంఘాల సభ్యులు ఫెడరేషన్‌కు రాజీనామాలు ఇచ్చినప్పుడు ``మీ సొంత అసోసియేషన్లలోనే తేల్చుకోండి`` అని వెనక్కి పంపిన ఫెడరేషన్... ఇప్పుడు మాత్రం ఆ రాజీనామాలను దగ్గరుండి ఎందుకు డీల్ చేస్తోందని ప్రశ్నించారు. ఈ ద్వంద్వ వైఖరి వెనుక ఏవైనా శక్తుల ప్రమేయం ఉందా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.
అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సుమలత తిప్పికొట్టారు. ఎన్నికలు జరగాలంటే కేవలం ఫెడరేషన్ అనుమతి మాత్రమే తప్పనిసరి అనే నిబంధన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కార్మిక చట్టాల ప్రకారం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) ప్రతినిధుల సమక్షంలో లేదా నేరుగా ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఎన్నికలను చట్టబద్ధంగా నిర్వహించుకోవచ్చని సుమలత నిబంధనల పత్రాలను చూపిస్తూ వివరించారు. బైలాస్ పరిధిలోనే తాము వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
తమ అసోసియేషన్‌లో కొందరు వ్యక్తులు చేస్తున్న ఆర్థికపరమైన అక్రమాలను తాము కేవలం గాల్లో మాటలుగా కాకుండా... పక్కా ఆధారాలతో నిరూపించామని సుమలత వివరించారు. జనరల్ బాడీ సమావేశంలోనే సభ్యులందరి ముందూ ఈ అక్రమాలను బహిర్గతం చేశామని పేర్కొన్నారు. తాము చేస్తున్నది కేవలం కొందరిపై వ్యక్తిగత కక్షతో కాదని..ఇండస్ట్రీలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఎంతోమంది పేద డ్యాన్సర్ల భవిష్యత్తు కోసం.. అసోసియేషన్ ప్రతిష్టను కాపాడటం కోసమే ఈ న్యాయపోరాటమని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.