కొరియోగ్రాఫర్ సుమలత క్షమాపణలు.. జానీ మాస్టర్ కెరీర్ కోసమే!
| జానీ మాస్టర్ భార్య సుమలత గతంలో ఫిల్మ్ ఛాంబర్, డ్యాన్సర్స్ యూనియన్‌పై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో, పూర్తి వివరాలు తెలియక మాట్లాడానని వివరణ ఇచ్చారు. ఆలస్యంగానైనా తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడాన్ని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు స్వాగతించారు. దీంతో పాత వివాదాలకు తెరపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత (అయేషా) పేరు డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదాలతో ముడిపడిన సంగతి తెలిసిందే. శేఖర్ మాస్టర్- రఘు మాస్టర్ కి వ్యతిరేకంగా తన భర్త జానీ మాస్టర్ నిషేధ సమయంలో సుమలత మీడియా ఎదుట పోరాటం సాగించారు. అయితే గతంలో జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్న సమయంలో తాను భావోద్వేగానికి లోనై, నిజానిజాలు పూర్తిగా తెలియక కొందరిపై అనుచిత వ్యాఖ్యలు చేశానని సుమలత బహిరంగంగా క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే.
దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు స్పందిస్తూ.. ఆలస్యంగానైనా సుమలత తన తప్పును గ్రహించి క్షమాపణ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో జానీ మాస్టర్ కేసు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ -డ్యాన్సర్స్ యూనియన్ తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఛాంబర్ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. తమ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని సుమలత మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకోకుండా ఆవేశంలో అలా మాట్లాడానని, ఛాంబర్ పెద్దలను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని తాజాగా సుమలత వివరణ ఇచ్చారు.
ఈ పరిణామంపై టీఎఫ్‌సీసీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్ ఎప్పుడూ బాధితుల పక్షానే నిలుస్తుందని.. నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వివాదం జరిగిన సమయంలో సుమలత చేసిన వ్యాఖ్యలు ఛాంబర్ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని.. అందుకే అప్పట్లో ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తమైందని గుర్తు చేశారు. ఇప్పుడు స్వయంగా ముందుకు వచ్చి నిజం తెలుసుకుని క్షమాపణ చెప్పడం ఒక సానుకూల పరిణామమని అన్నారు.
సినిమా పరిశ్రమలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు అందరూ సంయమనం పాటించాలని.. పూర్తి వివరాలు తెలియకుండా వ్యవస్థలపై నిందలు వేయడం సరికాదని టీఎఫ్‌సీసీ సభ్యులు హితవు పలికారు. ఒక భార్యగా తన భర్తను కాపాడుకోవాలనే ఆరాటంలో ఆమె అలా ప్రవర్తించి ఉండవచ్చని.. కానీ ఇండస్ట్రీ పెద్దల విషయంలో గౌరవం ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ క్షమాపణతో పాత వివాదాలకు తెరపడినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తంమీద జానీ మాస్టర్ వివాదం తర్వాత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాలతో నెలకొన్న గ్యాప్‌ను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే సుమలత ఈ అడుగు వేశారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో జానీ మాస్టర్ కెరీర్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఫిల్మ్ ఛాంబర్ -యూనియన్ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించేందుకే ఈ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.