నాగచైతన్య ఫేవరెట్ ట్రావెల్ స్పాట్స్.. ఆ ఐలాండ్ పేరు మాత్రం సీక్రెట్!
| ట్రావెల్ యూట్యూబర్ జాస్తితో పాడ్‌కాస్ట్‌లో నాగచైతన్య తనకు నచ్చిన ట్రావెల్ డెస్టినేషన్స్ గురించి వెల్లడించారు. ఒడిశా అడవులు, లడఖ్, గోవా సమీపంలోని ఓ రహస్య ఐలాండ్, హంపి, క్రొయేషియాలోని ప్యాగ్ ఐలాండ్ తన ఫేవరెట్స్ అని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బైక్ రైడ్స్‌కు హంపిని గట్టిగా రికమెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన నటించిన 'వృషకర్మ' డిసెంబర్ 4న విడుదల కానుంది.
సినిమా షూటింగ్స్ పక్కన పెడితే నాగచైతన్యకు బైక్ రైడ్స్, ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేటెస్ట్ గా ట్రావెల్ యూట్యూబర్ జాస్తితో చేసిన క్యాండిడ్ పాడ్ కాస్ట్ లో చైతన్య తన ట్రావెల్ అనుభవాలను ఓపెన్ గా పంచుకున్నారు. ముందుగా పెద్దగా ప్లాన్స్ వేసుకోకుండా, మంచి ఫుడ్ స్పాట్స్, మ్యూజిక్ ఆధారంగా తన ప్రయాణాలు సాగుతాయని చెబుతూ, తనకు బాగా నచ్చిన బెస్ట్ డెస్టినేషన్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఈ చిట్ చాట్ లో ముందుగా ఒడిశా, లడఖ్ జ్ఞాపకాలను చైతన్య గుర్తుచేసుకున్నారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఒడిశా అడవులు బెస్ట్ ఆప్షన్ అని చెబుతూ, అక్కడ జనసంచారం లేని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో నాలుగైదు రోజులు ఉన్న అనుభవం ఎంతో మెమొరబుల్ గా నిలిచిందన్నారు. అలాగే లడఖ్ ను తన సెకండ్ హోమ్ గా అభివర్ణించిన ఆయన, కార్గిల్ ప్రాంతంలో నాలుగైదు నెలల పాటు షూటింగ్ (లాల్ సింగ్ చడ్డా) చేసిన రోజులు తనకు ఎప్పటికీ స్పెషల్ అని తెలిపారు.
బీచ్ లవర్ అయిన చైతన్యకు గోవా అంటే ఎప్పటినుంచో ఇష్టం. అయితే రద్దీగా ఉండే రెగ్యులర్ బీచ్ ల కంటే, గోవా నుంచి రెండున్నర గంటల ప్రయాణ దూరంలో ఉండే ఒక చిన్న ఐలాండ్ తన ఫేవరెట్ అని చెప్పారు. కేవలం ఐదారు వందల మంది జనాభా మాత్రమే ఉండే ఆ దీవి ప్రశాంతంగా ఉంటుందని, అక్కడి లోకల్ ఫుడ్, మ్యూజిక్ తనకు బాగా నచ్చుతాయని అన్నారు.
ఆ ప్రదేశానికి జనం తాకిడి పెరగకూడదనే ఉద్దేశంతో ఆ ఐలాండ్ పేరును మాత్రం బయటపెట్టకుండా సీక్రెట్ గా ఉంచారు. ఇక హైదరాబాద్ నుంచి వీకెండ్ రైడ్స్ ప్లాన్ చేసే వాళ్లకు హంపిని చైతన్య స్ట్రాంగ్ గా రికమెండ్ చేశారు. ఆదివారం ఉదయాన్నే తన హైదరాబాద్ బైకర్స్ కమ్యూనిటీతో కలిసి ఇప్పటివరకు ఆరేడు సార్లు హంపికి వెళ్లినట్లు గుర్తుచేసుకున్నారు. అక్కడి రాళ్లు, వైల్డ్ నేచర్ అడ్వెంచర్ లవర్స్ కు మంచి కిక్ ఇస్తాయని, ఆ రైడ్స్ వల్లే గ్రూప్ లోని సభ్యులంతా ఇప్పుడు తనకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారని చెప్పారు.
మ్యూజిక్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడుతూ క్రొయేషియాలోని ప్యాగ్ ఐలాండ్ ప్రస్తావన తెచ్చారు. ఏడాదికి కనీసం రెండుసార్లయినా మ్యూజిక్ ఫెస్టివల్స్ కు వెళ్లే అలవాటు ఉన్న చైతన్య, భారీ ఖర్చుతో కూడిన పెద్ద ఈవెంట్ల కంటే క్రొయేషియాలోని ఈ చిన్న దీవిలో జరిగే ఫెస్టివల్ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే స్పాట్స్ లో అదొకటని చెప్పుకొచ్చారు.
నార్మల్ గా సెలబ్రిటీలు లగ్జరీ వెకేషన్స్ గురించి చెబుతుంటారు కానీ, చైతన్య మాత్రం నేచర్ కు దగ్గరగా ఉండే ఆఫ్ బీట్ స్పాట్స్ ను ఎంచుకోవడం విశేషం. రియల్ లైఫ్ లో ఇలా అడవులు, కొత్త ప్రదేశాలను ఎక్స్ ప్లోర్ చేసే ఆయన, ఇప్పుడు తెరపై కూడా అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' డిసెంబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో చైతన్య ట్రెజర్ హంటర్ అర్జున్ గా కనిపించనున్నాడు.