మళ్లీ పెళ్లి మాట ఎత్తిన అల్లు అరవింద్.. ఈసారి ఆ హీరోయిన్ వంతు!
| 'ఆకాశంలో ఒక తార' సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ హీరోయిన్ రుహానీ శర్మను సరదాగా ఆటపట్టించారు. నీ కోసం ఒక అబ్బాయిని వెతుకుతున్నానంటూ కామెంట్ చేయడంతో ఆమె సిగ్గుపడుతూ నవ్వారు. గతంలో లావణ్య త్రిపాఠి, మృణాల్ ఠాకూర్ విషయంలోనూ అరవింద్ ఇలాంటి పెళ్లి పంచ్‌లు వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
స్టేజ్ మీద అల్లు అరవింద్ మైక్ అందుకుంటే సినిమా కబుర్లతో పాటు అప్పుడప్పుడు సరదా పంచ్ లు కూడా పేలుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి విషయంలో ఆయన వేసే పంచ్ లు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంటాయి. రీసెంట్ గా 'ఆకాశంలో ఒక తార' సక్సెస్ మీట్ లోనూ అరవింద్ అదే తరహాలో హీరోయిన్ రుహానీ శర్మను ఆటపట్టించారు. యూనిట్ సభ్యుల గురించి మాట్లాడుతున్న ఆయన, రుహానీ పేరు రాగానే టాపిక్ మార్చేసి నవ్వించారు.
వేదికపై రుహానీని చూస్తూ, నీ గురించి పబ్లిక్ గా మాట్లాడలేనని, ప్రైవేట్ గా మాట్లాడుకుందామని అల్లు అరవింద్ అన్నారు. అంతటితో ఆగకుండా, నీ కోసం ఒక అబ్బాయిని వెతుకుతున్నానంటూ సరదా కామెంట్ విసిరారు. ఆ మాట వినగానే రుహానీ సిగ్గుపడుతూ నవ్వేశారు. అయితే అరవింద్ అక్కడ కేవలం పది సెకన్లు మాత్రమే అలా సరదాగా మాట్లాడి, వెంటనే నిర్మాత స్వప్న దత్ గురించి ప్రస్తావించడం మొదలుపెట్టారు.
అయినా సరే, అల్లు అరవింద్ నోటి నుంచి పెళ్లి మాట రాగానే మెగా ఫ్యాన్స్ కు వెంటనే లావణ్య త్రిపాఠి గుర్తొచ్చారు. గతంలో 'చావు కబురు చల్లగా' ఈవెంట్ లో లావణ్య తెలుగు బాగా మాట్లాడుతోందని మెచ్చుకుంటూ, ఇక్కడే ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని అరవింద్ సలహా ఇచ్చారు. అప్పటికే 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాలతో దగ్గరైన వరుణ్ తేజ్, లావణ్య 2023 జూన్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుని, నవంబర్ లో పెళ్లి పీటలెక్కారు.
వరుణ్, లావణ్య పెళ్లి ఫిక్స్ అయిన టైమ్ లో అల్లు అర్జున్ స్వయంగా తన తండ్రి పాత స్పీచ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది బాగా ట్రెండ్ అయింది. వాళ్ల ప్రేమ కథ వేరు అయినప్పటికీ, అరవింద్ సరదాగా అన్న మాట నిజం కావడంతో ఆయనకు ఈ విషయంలో మంచి సెంటిమెంట్ ఉందని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తుంటారు.
లావణ్య తర్వాత మృణాల్ ఠాకూర్ విషయంలోనూ అల్లు అరవింద్ ఇదే ఫార్ములా రిపీట్ చేశారు. 2023లో జరిగిన ఒక అవార్డుల ఫంక్షన్ లో మృణాల్ ను హైదరాబాద్ అబ్బాయిని చేసుకుని ఇక్కడే ఉండిపోవాలని అన్నారు. ఆ తర్వాత ఆమె పెళ్లిపై రూమర్స్ రావడంతో మృణాల్ స్వయంగా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఈ ఏడాది 'డెకాయిట్' ఈవెంట్ లోనూ అరవింద్ తెలుగు అబ్బాయి ప్రస్తావన తెచ్చి మృణాల్ ను ఆటపట్టించారు.
అయితే లావణ్య, మృణాల్ కు చెప్పినట్లు రుహానీని మాత్రం తెలుగు అబ్బాయిని చేసుకోమని గానీ, హైదరాబాద్ లో సెటిల్ అవ్వమని గానీ అరవింద్ అనలేదు. కేవలం అబ్బాయిని వెతుకుతున్నానని మాత్రమే నవ్వుతూ చెప్పారు. 'చి ల సౌ' తో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన రుహానీ, 'ఆకాశంలో ఒక తార' లో బిజిలీ పాత్రలో నటించారు. మరి అరవింద్ వేసిన ఈ సరదా పంచ్ తర్వాత రుహానీ లైఫ్ లో నిజంగానే పెళ్లి కబురు వినిపిస్తుందో లేదో చూడాలి.