కాకా.. ఓ క్లారిటీ వచ్చేసిందిగా..
| చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'కాకా' సంక్రాంతి విడుదలపై వస్తున్న వాయిదా ప్రచారానికి మేకర్స్ తెరదించారు. జనవరి 13న సినిమా విడుదల కానున్నట్లు షూటింగ్ స్పాట్ ఫొటోతో స్పష్టం చేశారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనస్వర రాజన్ చిరంజీవి కూతురిగా నటిస్తున్నారు.
కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సినిమా 'కాకా' వాయిదా పడుతుందంటూ రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. మరో సినిమా 'విశ్వంభర' కూడా పండగ రేసులోకి రావొచ్చనే టాక్ రావడంతో, 'కాకా' వెనక్కి తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన షూటింగ్ స్పాట్ ఫొటోతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. జనవరి 13న 'కాకా' థియేటర్లలోకి రావడం పక్కా అని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
నిజానికి చిరంజీవికి సంక్రాంతి సీజన్ ఎప్పుడూ కలిసొచ్చే సెంటిమెంట్. ఈ ఏడాది పండక్కి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుని పెద్ద హిట్ కొట్టింది. ఆ సక్సెస్ ఇచ్చిన జోష్ తోనే చిరు ఇప్పుడు మళ్లీ అదే సంక్రాంతి బరిని టార్గెట్ చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా పండగ బాక్సాఫీస్ పై కన్నేయడం మెగా ఫ్యాన్స్ లో మంచి కిక్ ఇచ్చింది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి నుంచి పండగ టార్గెట్ తోనే రెడీ అవుతోంది. 2023 సంక్రాంతికి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అప్పట్లో బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' నుంచి గట్టి పోటీ ఎదురైనా, మాస్ ఎలిమెంట్స్, వింటేజ్ చిరు మేనరిజమ్స్ తో బాబీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశారు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అదే కాంబో సంక్రాంతికి రిపీట్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.
అయితే 'వాల్తేరు వీరయ్య' తరహా రొటీన్ మాస్ ఫార్ములా కాకుండా, ఈసారి బాబీ కాస్త కొత్త రూట్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన 'కాకా' గ్లింప్స్ లో చిరంజీవిని చాలా రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ లో చూపించారు. యాక్షన్ తో పాటు ఇందులో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కూడా కీలకంగా ఉండబోతోందని సమాచారం. చిరు కూతురి పాత్రలో మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని తేలిపోవడంతో, ఇక ప్రమోషన్ల స్పీడ్ పెంచేందుకు టీమ్ రెడీ అవుతోంది. ముందుగా మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ప్లాన్ లో భాగంగా, ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను అతి త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మరోవైపు 'విశ్వంభర' రిలీజ్ డేట్ పై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా సంక్రాంతి రేసులో 'కాకా' దిగడం ఖాయమైపోయింది. గత పండక్కి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో హిట్ కొట్టిన చిరంజీవి, ఈసారి మార్క్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.