నాగార్జున 'ర‌క్ష‌కుడు'లా 60 ప్లస్ హీరో 'సుబేదార్' తిరుగుబాటు

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన 'సుబేదార్' ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.;

Update: 2026-02-25 02:30 GMT

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన 'సుబేదార్' ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 69 ఏళ్ల వయసులో కూడా అనిల్ కపూర్ చూపించిన ఎనర్జీ, ఆ యాక్షన్ మోడ్ చూస్తుంటే ఇది ఆయన కెరీర్‌లో ఒక పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ అనిపిస్తోంది. అంతే ఇంట్రెస్టింగ్ గా కపూర్ జీ 'సుబేదార్' ట్రైలర్ చూస్తుంటే మనకు నాగార్జున నటించిన 'ర‌క్షకుడు' (1997) సినిమా ఛాయలు స్ప‌ష్ఠంగా కనిపిస్తున్నాయి.

ఈ రెండు సినిమాల మధ్య ఉన్న పోలిక ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రక్షకుడులో నాగార్జున అజయ్ అనే నిరుద్యోగిగా క‌నిపిస్తాడు. ఇందులో నాగార్జున ఒక నిరుద్యోగిగా ఉండి సమాజంలోని అరాచకాలను భరించలేక ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు. ఒక ఫ్యాక్టరీని కబ్జా చేయాలనుకునే గూండాల గుంపును ఒంటరిగా ఎదిరిస్తాడు.

ఇప్పుడు సుబేదార్ (అర్జున్ మౌర్య) పోరాటం అలానే ఉంది. అనిల్ కపూర్ ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. దేశ సరిహద్దుల్లో పోరాడి వచ్చిన వ్యక్తి, తన సొంత గడ్డపై జరుగుతున్న 'ఇసుక మాఫియా' దోపిడీని చూసి సహించలేక ఆయుధం పడతాడు. రెండు సినిమాల్లోనూ కామన్ పాయింట్ ఏమిటంటే వ్య‌వస్థ విఫలమైన చోట ఒక సామాన్యుడు (లేదా మాజీ సైనికుడు) తిరగబడటాన్ని సుబేదార్ లో చూస్తున్నాం.

'రక్షకుడు'లో మాఫియా డాన్ తన బలం, బలగం అయిన రౌడీ గ్యాంగ్‌తో ఒక పరిశ్రమను ఆక్రమించుకోవాలని చూస్తే, ఇక్కడ `సుబేదార్`లో ఇసుక మాఫియా నదీ తీరాలను, ప్రజల జీవనాధారాన్ని దోచుకుంటుంది. ఈ రెండు పాత్రలు కూడా తమ వ్యక్తిగత లాభం కోసం కాకుండా.. 'సామాజిక బాధ్యత' కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం ఆస‌క్తిని క‌లిగిస్తాయి.

'రక్షకుడు' ఆ కాలంలోనే అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, ప్రవీణ్ గాంధీ మేకింగ్ హాలీవుడ్ తరహాలో ఆక‌ట్టుకుంది.. కానీ సినిమాలో ఎమోష‌న‌ల్ ట‌చ్ మిస్స‌వ్వ‌డంతో ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. కానీ `సుబేదార్` గ్రిప్పింగ్ డ్రామా ఆక‌ట్టుకుంటోంది. ఇది అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కావడంతో మేకింగ్ క్వాలిటీ చాలా రిచ్‌గా.. రాగా ఆక‌ట్టుకుంటోంది.

ర‌క్ష‌కుడులో నాగార్జున తన ఫిజిక్, స్టైలిష్ యాక్షన్‌తో అలరిస్తే.. అనిల్ కపూర్ 69 ఏళ్ల వయసులో కూడా అదే స్థాయి ఇంటెన్సిటీని 'సుబేదార్'లో చూపిస్తున్నారు. 'రక్షకుడు'లో విలన్ గూండాల గుంపుతో చేసే దాష్టీకం, `సుబేదార్`లో ఇసుక మాఫియా చేసే గూండారాజ్ ఒకేలా అనిపిస్తున్నాయి. రెండింటిలోనూ హీరో తన తెలివితేటలతో వార్ టెక్నిక్స్ తో మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా కూల్చార‌నేదే కీలకం.

రక్షకుడు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు అదే తరహా `ప్రొటెక్టర్` (రక్షకుడు) రోల్‌లో అనిల్ కపూర్ 'సుబేదార్'గా రావడం విశేషం. కాలం మారింది.. సమస్య మారింది..ఫ్యాక్టరీ కబ్జా నుంచి ఇసుక మాఫియా వరకు క‌థ షిఫ్ట‌యింది.. కానీ ఆవేశం మాత్రం అదే! అనీల్ క‌పూర్ త‌ర‌హాలోనే ఓటీటీలోకి నాగార్జున లాంటి స్టార్ ఎంట్రీ ఇవ్వాలంటే, ఇలాంటి ఒక ప‌వ‌ర్ ఫుల్ మాస్ యాక్ష‌న్ కంటెంట్ ని ఎంపిక చేసుకుంటే బావుంటుందేమో!!



Tags:    

Similar News