ఆటోలో షూటింగ్ కి వెళ్లిన లెజెండ్స్!

కోట్లాది రూపాయల ఆస్తులు, లగ్జరీ వాహనాలు ఉన్నా ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ ఆటో రిక్షా ఎక్కి షూటింగ్ సెట్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచిన లెజెండ్స్ చరిత్రలో ఎందరో ఉన్నారు.

Update: 2026-10-10 11:30 GMT

గ్లామర్ ప్రపంచంలో కోట్లు సంపాదించే స్టార్ హీరోలంటే లగ్జరీ కార్లు, క్యారవాన్లు, బౌన్సర్ల పహారానే గుర్తుకొస్తాయి. ఎక్కడికి వెళ్లినా హంగులు, ఆర్భాటాలతో సందడి చేసే సినీ రంగంలో అందుకు పూర్తి భిన్నంగా నిరాడంబరతను చాటుకున్న మహానటులు కూడా ఉన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులు, లగ్జరీ వాహనాలు ఉన్నా ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ ఆటో రిక్షా ఎక్కి షూటింగ్ సెట్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచిన లెజెండ్స్ చరిత్రలో ఎందరో ఉన్నారు.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రజా నటుడు ఆర్ నారాయణమూర్తి. `ఎర్ర సైన్యం`, `ఒసేయ్ రాములమ్మ` వంటి సంచలన చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కామ్రేడ్ రియల్ లైఫ్‌లోనూ అచ్చమైన ప్రజా మనిషి. ఓ వైపు దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా కోట్లు ఆర్జించే అవకాశం ఉన్నా? నేటికీ కారు కొనకుండా సింపుల్‌గా ఆటోల్లో ప్రజ రవాణాలోనే షూటింగ్ స్పాట్‌లకు వెళ్లడం ఆయనకే చెల్లింది. క్రమశిక్షణ, నిరాడంబరతకు కామ్రేడ్ నిలువెత్తు నిదర్శనం.

బాలీవుడ్ రంగుల ప్రపంచంలో నివసిస్తూ కూడా ల‌గ్జ‌రీకి ఏమాత్రం ప్రభావితం కాకుండా బ్ర‌తికిన‌ మరో నటుడు నానా పటేకర్. పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌లతో ఆడియన్స్‌ను మెప్పించిన‌ దిగ్గజ నటుడు మూడు ద‌శాబ్దాల పాటు షూటింగ్‌లకు సాధారణ ఆటోలోనే ప్రయాణించారంటే ఆయన ఎంతటి సాదాసీదా మనిషో అద్దం ప‌డుతుంది. ఆడంబరాలకు దూరంగా ఉండటమే కాకుండా తన సంపాదనలో సింహభాగాన్ని రైతులకు, సమాజ సేవకు ధారపోసిన మహోన్నత వ్యక్తి ప‌టేక‌ర్.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ విషయానికి వస్తే ఆయన రీల్ లైఫ్‌లో ఎంత మాస్‌గా ఉంటారో? రియల్ లైఫ్‌లో అంత సింపుల్‌గా ఉంటారు. బస్ కండక్టర్ స్థాయి నుంచి ఇండియన్ బాక్సాఫీస్ సుల్తాన్‌గా ఎదిగినా? ఆ పాత రోజులను ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. ఇటీవల మైసూర్ సమీపంలో జరుగుతున్న `ధర్మన్` సినిమా షూటింగ్ సెట్‌కు కూడా ఆయన ఎలాంటి సెక్యూరిటీ హంగామా లేకుండా సాధారణ ఆటోలో ప్రయాణించి సెట్‌కు చేరుకుని యూనిట్ సభ్యులను, అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.

అలాగే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా సమయపాలనకు ప్రాధాన్యమిస్తారు. హైదరాబాద్ ట్రాఫిక్‌లో కారు ఇరుక్కుపోయి షూటింగ్‌కు ఆలస్యం అవుతుందని భావిస్తే ఏమాత్రం ఆలోచించ‌కుండా ఆటో ఎక్కి సెట్‌కు చేరుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ కూడా ముంబై మహానగరంలో ట్రాఫిక్ చిక్కులను దాటుకుంటూ బాంద్రాలోని తన ఇంటి నుంచి మహబూబ్ స్టూడియోస్‌కు ఆటోలోనే వెళ్లడం, డ్రైవర్లతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించడం అభిమానులు తరచూ చూస్తుంటారు.ఆ ర‌కంగా స్టార్ డమ్, హోదా పక్కన పెట్టి సమయానికి ప్రాధాన్యమిస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ఆచరించి చూపిన సినీ దిగ్గజాలు రాబోయే తరాలకు ఎప్పటికీ స్పూర్తిదాయకమే.

Tags:    

Similar News