వారసత్వంతో స్టార్‌డమ్ సాధ్యమా? అసాధ్యమా?
ఇండస్ట్రీలో వారసత్వం ఎలా పని చేస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్ర నటుల వారసులు వెండితెరపైకి రావడం, వారికి ఘనస్వాగతం లభించడం తరుచూ చూస్తూనే ఉంటాం.;
ఇండస్ట్రీలో వారసత్వం ఎలా పని చేస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్ర నటుల వారసులు వెండితెరపైకి రావడం, వారికి ఘనస్వాగతం లభించడం తరుచూ చూస్తూనే ఉంటాం. తల్లిదండ్రుల ఇమేజ్‌తో పరిశ్రమలోకి అడుగుపెట్టడం సులభమే. అదే ఇమేజ్‌తో స్టార్‌డమ్‌ను పొందడం, దాన్ని సుదీర్ఘకాలం కొనసాగించ డం అన్నది మాత్రం చిన్న విషయం కాదు. ప్రేక్షకుల అభిరుచులు మారుతోన్న నేటి కాలంలో వారసుడు అనే ముద్ర విజయానికి గ్యారెంటీ ఇవ్వలేకపోతోందన్నది అంతే వాస్తవం. వారసత్వం వల్ల లభించే అతిపెద్ద ప్రయోజనం లాంచింగ్. సాధారణ నటుడు తనను తాను నిరూపించుకోవడానికి ఏళ్ల తరబడి వేచి చూడాలి. కానీ స్టార్ కిడ్స్‌కు మొదటి సినిమానే భారీ బడ్జెట్, అగ్ర దర్శకుడు, భారీ ప్రచారం లభిస్తుంది. తల్లిదండ్రులపై ఉన్న అభిమానం ప్రత్కయక్ష, పరోక్షంగా కనిపిసక్తుంది. ఆ ఇమేజ్ మొదటి రోజు ప్రేక్షకుల్ని థియేటర్లకు సులభంగా తీసు కురాగలదు. ఆ క్రేజ్ అనేది కేవలం ప్రారంభ వసూళ్లకు మాత్రమే పరిమితం. తెరపై బొమ్మ పడిన తర్వాత ప్రేక్షకులు చూసేది నటుడిలోని ప్రతిభను మాత్రమే. వారి వారసత్వాన్ని కాదని గుర్తించాలి.
తల్లిదండ్రుల ఇమేజ్ అన్నది ఓ రకంగా వారసులపై మోయలేని బాధ్యతను పెంచుతుంది. చాలా విషయాల్లో కుమారుల్ని తల్లిదండ్రులతో పోల్చడం వల్ల తమకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవడం కష్టమవుతుంది. తండ్రి అంత గొప్పగా డ్యాన్స్ చేయలేదని లేదా తల్లి అంతటి హావభావాలు పండించలేదని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోయి తల్లిదండ్రుల అనుకరణకు పరిమితమైన వారెందరో ఇండస్ట్రీలో కనుమరుగయ్యారు. కొంత మంది వారసుల్ని పరిశీలిస్తే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వారసులందరూ తమ తల్లిదండ్రుల ఇమేజ్‌ను కేవలం ఒక పునాదిగా మాత్రమే వాడుకున్నారు. ఉదాహరణకు చిరంజీవి వారసుడిగా పరిచయమైన రామ్ చరణ్ అయినా, అక్కినేని నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య అయినా.. ప్రారంభంలో ఇబ్బందులు పడినా? తర్వాత కాలంలో తమదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఫలానా వారి అబ్బాయి అనే ఇమేజ్ నుంచి బయట పడిన స్టార్స్ వాళ్లంతా. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నప్పుడే వారి స్టార్ డమ్ స్థిరంగా కొనసాగుతుంది. నేటి సోషల్ మీడియా యుగంలో ప్రేక్షకులు చాలా విషయాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతిభ లేని వారసత్వాన్ని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. పాత సినిమాల సెంటిమెంట్‌ను వాడటం , తండ్రి డైలాగులను అనుకరించడం ద్వారా కొంతకాలం నెట్టుకురావచ్చు. కానీ అది కెరీర్‌ను నిర్మించలేదు. నేటి ఆడియన్స్ కంటెంట్ కు పట్టం కడుతున్నారు. సొంతంగా కష్టపడి భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటనలో పరిణతి చూపిస్తేనే వారసత్వానికి విలువ దక్కుతుందన్నది కాదనలేని నిజం. తల్లిదండ్రుల ఇమేజ్ అనేది విజిటింగ్ కార్డ్ లాంటిది. అది తలుపులు తెరుస్తుంది కానీ లోపల కుర్చీ వేసుకుని కూర్చోవాలంటే మాత్రం సొంత ప్రతిభతో ఎదగాల్సిందే. వారసత్వం తో ఒక అవకాశం రావచ్చు. కానీ విజయం అనేది కష్టం, అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.