స్టార్ డైరెక్ట‌ర్స్ తీరు ప్యాన్స్ లో నిరాశ‌!

స్టార్ డైరెక్ట‌ర్స్ ఫ్యాన్స్ లో నిరుత్సాహం నిండిపోతుందా? డైరెక్ట‌ర్ల తీరుతో అభిమానులు విసుగుపోతున్నా రా? సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.;

Update: 2025-04-04 18:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్స్ ఫ్యాన్స్ లో నిరుత్సాహం నిండిపోతుందా? డైరెక్ట‌ర్ల తీరుతో అభిమానులు విసుగుపోతున్నా రా? సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. మ‌రెందుకు ఇలా జ‌రుగుతుంది అంటే? విష‌యంలోకి వెళ్లాల్సిందే. ఎస్ ఎస్ రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత కొత్త సినిమా మొద‌లు పెట్ట‌డానికి రెండున్న‌రేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. కొన్ని నెల‌ల క్రితమే సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే త్రివిక్ర‌మ్ `అల వైకుంఠ‌పురం` త‌ర్వాత కొత్త ప్రాజెక్ట్ `గుంటూరు కారం` మూడేళ్ల త‌ర్వాత చేసారు. మ‌రోస్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ స‌న్నివేశం అలాగే ఉంది. `ఆచార్య` రిలీజ్ అయిన రెండేళ్లకు `దేవ‌ర` రిలీజ్ అయింది. `దేవ‌ర 2` ఎప్పుడొస్తుందో తెలియదు. ప్ర‌స్తుతం ఆ స్క్రిప్ట్ పైనే కొర‌టాల ప‌ని చేస్తున్నారాయ‌న‌. సుకుమార్, సందీప్ రెడ్డి వంగా కొత్త ప్రాజెక్ట్ లు ఎప్పుడు మొద‌ల‌వుతాయో తెలియ‌దు. ప్ర‌స్తుతానికి లాంగ్ బ్రేక్ లో ఉన్నారు.

ఇలా స్టార్ డైరెక్ట‌ర్లు అంతా మూడేళ్ల‌కు..నాలుగేళ్ల‌కు ఒక్కో సినిమా చేయ‌డంపై అభిమానులు నిరుత్సాహం వ్య‌క్తం చేస్తున్నారు. స్టార్ హీరో డేట్లు లేవ‌ని మ‌రో హీరోతో సినిమా చేసే ఆలోచ‌న ఎందుకు చేయ‌డం లేద‌ని ప్రశ్నిస్తున్నారు. కేవ‌లం స్టార్ డైరెక్ట‌ర్లు అంటే స్టార్ హీరోల‌తోనే ప‌ని చేయాలా? టైర్ 2 హీరోలు...స‌క్సెస్ లో ఉన్న యంగ్ హీరోలతో ప‌నిచేయ‌కూడ‌దా? అలా చేస్తే వాళ్ల మార్కెట్ కి న‌ష్టం వాటిల్లుతుందా? అని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మోజులో ప‌డి పేరున్న డైరెక్ట‌ర్లు అంతా అన‌వ‌స‌రంగా స‌మ‌యం వృద్ధా చేస్తున్నార‌నే వాద‌న తెర‌పైకి వ‌స్తోంది.

వ‌య‌సు మీద ప‌డే కొద్ది క్రియేటివ్ థాట్స్ కూడా త‌గ్గిపోతాయ‌ని..వ‌య‌సులో ఉన్న‌ప్పుడే చ‌క‌చ‌కా ప‌ని చేయాల‌ని అన్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. రాజ‌మౌళి కెరీర్ ఆరంభంలో గొప్ప చిత్రాలు చేసి మ‌ధ్య‌లో `మ‌ర్యాద రామ‌న్న` లాంటి సినిమా కూడా చేసి హిట్ అందుకున్నారు. అలాగ‌ని ఆయ‌న ఇమేజ్ ఏం త‌గ్గ‌లేదే! సుకుమార్ స్టార్స్ తో ప‌నిచేసి కూడా చిన్న సినిమాల్లోనూ క్రియేటివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు. మ‌రి త‌ర్వాత కాలంలో ఎందుకు చిన్న సినిమాల‌కు దూర‌మయ్యారు? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్నమ‌వుతుంది.

Tags:    

Similar News