శ్రీనివాసకి మహేష్‌ బాబు సపోర్ట్‌ దక్కేనా?

ఈ సినిమాను జులై 30న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. క్యూట్‌ లవ్‌ స్టోరీతో పాటు, యాక్షన్‌ ఎలిమెంట్స్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్ పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

Update: 2026-07-04 10:16 GMT

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు సిల్వర్‌ స్క్రీన్‌ పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెలుగు తెరకి పరిచయం కాబోతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో అశ్విని దత్‌ నిర్మాణంలో జయకృష్ణ హీరోగా రాబోతున్నాడు. 'శ్రీనివాస మంగాపురం'తో జయకృష్ణను అజయ్‌ భూపతి ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన 'శ్రీనివాస మంగాపురం' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను జులై 30న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. క్యూట్‌ లవ్‌ స్టోరీతో పాటు, యాక్షన్‌ ఎలిమెంట్స్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్ పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

మహేష్‌ బాబు సోదరుడి కొడుకు మూవీ...

మహేష్ బాబు సోదరుడి కొడుకు అయిన జయకృష్ణ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు అనగానే కృష్ణ అభిమానులు రమేష్‌ బాబును గుర్తు చేసుకున్నారు. రమేష్ బాబు ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోవడంలో విఫలం అయ్యాడు. కానీ ఆయన కొడుకు జయకృష్ణ కచ్చితంగా స్టార్‌ హీరోగా నిలుస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కృష్ణ ఫ్యామిలీ నుంచి ఏ హీరో ఎంట్రీ ఇచ్చినా కచ్చితంగా మహేష్ బాబు మద్దతు ఉంటుంది. గతంలో కృష్ణ ఉన్న సమయంలో కచ్చితంగా తన ఫ్యామిలీ హీరోలకు మద్దతుగా నిలిచేవాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధ్యత పూర్తిగా మహేష్ బాబుపై పడింది. సుధీర్ బాబు లేదా మరే హీరో మూవీ వచ్చినా కూడా మహేష్ బాబు ముందు ఉండి ఫ్యాన్స్ కు పరిచయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జయకృష్ణ ను సైతం అభిమానులకు మహేష్ బాబు పరిచయం చేయాలని అంతా కోరుకుంటున్నారు.

జయకృష్ణ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం...

జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న 'శ్రీనివాస మంగాపురం' సినిమాకు మహేష్‌ బాబు ఖచ్చితంగా వంద శాతం సహకారం అందించి, తన వంతు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఆ సినిమా టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో సినిమా చేసినా కూడా ఆ హీరో మీడియా ముందు ఎక్కువగా కనిపించకూడదు. అంతే కాకుండా పబ్లిక్ ఈవెంట్స్‌ లో ఎక్కువగా మాట్లాడకూడదు, అసలు పబ్లిక్‌ ఈవెంట్స్‌కి ఎక్కువగా హాజరు కాకూడదు అని కండీషన్స్‌ ఉంటాయి. కనుక మహేష్ బాబును శ్రీనివాస మంగాపురం కోసం రాజమౌళి పంపిస్తాడా లేదా అనే అనుమానాలను ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా వారు వ్యక్తం చేస్తున్నారు.

రాషా తడానీ హీరోయిన్‌గా 'శ్రీనివాస మంగాపురం'

ఒకటి రెండు ఈవెంట్స్‌కి మహేష్ బాబు హాజరు అయ్యి జయకృష్ణను పరిచయం చేసి, సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడితే జరగాల్సిన పని అంతా అదే జరిగి పోతుందని విశ్లేషకులు అంటున్నారు. తండ్రిలేని బిడ్డ కనుక జయకృష్ణకు మహేష్ బాబు సహకారం చాలా అవసరం. తండ్రి స్థానంలో మహేష్ బాబు నిల్చుని జయకృష్ణను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని, అందుకోసం అయినా మహేష్‌ బాబుకు రాజమౌళి సమయం ఇవ్వాలని, అనుమతించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాజమౌళి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తేనే జయకృష్ణకు మహేష్ బాబు సపోర్ట్‌ దక్కుతుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ సీనియర్‌ హీరోయిన్‌ రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడానీ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్‌లో రాషా ఎంట్రీతోనే మంచి క్రేజ్‌ దక్కించుకోవడం ఖాయం అని, టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ఇండస్ట్రీల్లోనూ రాషా భవిష్యత్తులో స్టార్‌గా వరుస సినిమాలు చేయబోతుందని ఆమె సన్నిహితులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాకు జీ వీ ప్రకాష్ కుమార్‌ సంగీతాన్ని అందించాడు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మంచి ప్రేమ కథతో పాటు, యాక్షన్‌ ఎలిమెంట్స్ ఉంటాయని మేకర్స్‌ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

Tags:    

Similar News