మనీలాండరింగ్ కేస్.. స్టార్ నటులకు ఈడీ సమన్లు!
సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.;
సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకే సెలబ్రిటీలు ఆచితూచి అడుగులు వేయాలి అని అభిమానులు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. సమాజానికి సహాయంగా నిలవాల్సిన సెలబ్రిటీలు తప్పుదోవలో నడుస్తూ.. యువతను వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా.. వీరిని నమ్మిన ఎంతో మంది యువత.. డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఇప్పుడు మరికొంతమంది సెలబ్రిటీలు డబ్బు సంపాదించాలనే ఆలోచనలో తప్పుడు మార్గాన్ని ఎంచుకొని ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపోతే చట్టం దృష్టిలో అందరూ సమానమే కాబట్టి తప్పు చేసిన వారిని చట్టాలు కూడా ఎవరిని విడిచిపెట్టడం లేదు. అందులో భాగంగానే తాజాగా ఇద్దరు స్టార్ హీరోలకు కొకైన్ సరఫరా, మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. వారు ఎవరో కాదు కోలీవుడ్ నటులుగా పేరు సొంతం చేసుకున్న శ్రీకాంత్, కృష్ణ. అక్రమ రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ తో పాటు కృష్ణ లకు ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అక్టోబర్ 27న శ్రీకాంత్.. 28న కృష్ణ విచారణకు హాజరు కావాలి అని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇకపోతే మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించి ఈ ఏడాది జూన్లో చెన్నై పోలీసులు వీరిద్దరిపై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగానే ఇప్పుడు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఈ దర్యాప్తులో భాగంగా శ్రీకాంత్, కృష్ణ ల వాంగ్మూలాలను నమోదు చేసుకున్న అధికారులు.. నార్కోటిక్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో శ్రీకాంత్ ను చెన్నై పోలీసులు జూన్లో అరెస్టు చేశారు. ఇకపోతే ఈ మొత్తం వ్యవహారంలో శ్రీకాంత్ సుమారుగా 4.50లక్షల అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఏకంగా 40 సార్లు కొకైన్ కొన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇకపోతే ఈ గొడవ అంతా జరగడానికి కారణం ఒక పబ్బు లో అన్నాడిఎంకె ఐటీ వింగ్ మాజీ నేత ప్రసాద్ ఘర్షణకు దిగడమే. మద్యం మత్తులో ఆయన గొడవ చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ క్రమంలోనే డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అంతేకాదు ఈ ఘటనలో శ్రీకాంత్ పేరు బయటకు తీయడంతో.. అదుపులోకి తీసుకొని ఆరా తీసిన పోలీసులు నిజాలను బయటపెట్టారు ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న శ్రీకాంత్ విచారణలో ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.