అప్పుడు ఆర్యన్.. ఇప్పుడు తిలక్.. నిజమేంటి శ్రీలీల?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల మరోసారి డేటింగ్ రూమర్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల మరోసారి ఫేక్ డేటింగ్ రూమర్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. మొన్నటి వరకు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టగా.. ఇప్పుడు టీమిండియా యంగ్ క్రికెటర్ తిలక్ వర్మతో రిలేషన్ లో ఉందనే ప్రచారం నెట్టింట జరుగుతోంది. అయితే ఆ వార్తలపై ఇప్పటివరకు ఇద్దరూ అఫీషియల్ గా రెస్పాండ్ అవ్వలేదు.
ఇటీవల కాలంలో శ్రీలీల, తిలక్ వర్మ ఒకే సందర్భాల్లో కనిపించడం ఆ రూమర్లకు కారణమవుతోంది. గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీలీల తన తల్లి స్వర్ణలతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అదే సమయంలో తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో తిరుమలలో కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో ఇది సాధారణ యాదృచ్ఛికమని భావించినా.. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.
ఇటీవల ఐపీఎల్ సందర్భంగా ముంబై ఇండియన్స్ మ్యాచుల్లో శ్రీలీల కుటుంబ సభ్యులు కనిపించడం, స్టేడియంలో తిలక్ పేరుతో ఉన్న జెర్సీలు దర్శనమివ్వడం వంటి విషయాలు నెటిజన్లలో అనుమానాలు రేకెత్తించాయి. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ సమయంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలీల తల్లి కనిపించిందనే ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అంతకుముందు ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ కు శ్రీలీల హాజరుకావడం కూడా చర్చనీయాంశమైంది.
దీంతో గత ఏడాది నుంచి వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కొందరు అభిమానులు అయితే విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ, కేఎల్ రాహుల్- అతియా శెట్టి తరహాలో మరో క్రికెట్- సినిమా జోడీ సిద్ధమవుతోందని పోస్టులు పెడుతున్నారు.
అయితే ఆ వార్తలన్నింటినీ శ్రీలీల సన్నిహితులు ఖండిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని, ప్రేమ వ్యవహారాలపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తిలక్ వర్మ కూడా ఆ రూమర్లపై ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజమా? లేక అభిమానుల ఊహాగానాలా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక శ్రీలీల పేరు గతంలో కూడా పలువురు సెలబ్రిటీలతో లింక్ అయింది. ముఖ్యంగా కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆమె ఓ హిందీ సినిమాలో నటిస్తుండటంతో ఇద్దరి మధ్య క్లోజ్ పెరిగిందని వార్తలు వచ్చాయి. వినాయక చవితి వేడుకల సందర్భంగా శ్రీలీల తన తల్లితో కలిసి కార్తీక్ ఇంటికి వెళ్లడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. తనకు డాక్టర్ కోడలు కావాలని కార్తీక్ తల్లి చెప్పిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అందుకే డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ రావాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందేనని అభిమానులు భావిస్తున్నారు.