రష్మిక తర్వాత అదే విషయం వల్ల విసుగుచెందిన మరో హీరోయిన్..!
ఇప్పుడు ఇదే సమస్య శ్రీలీలకూ ఎదురైంది. ఇక ఇదే విషయంపై ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ అయ్యింది ఈ హీరోయిన్. సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ..ఏఐతో తయారయ్యే నకిలీ కంటెంట్‌కు మద్దతివ్వొద్దని చెప్పింది.;
ఇటీవలి కాలంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మన రోజువారి జీవితంలో భాగం అయిపోతూ వస్తోంది. కానీ అదే టెక్నాలజీని కొందరు తప్పుగా ఉపయోగిస్తూ..ఇతరులకు తీవ్రమైన మానసిక వేదన.. నష్టాలు.. కలిగిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్.. ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే నకిలీ ఫోటోలు..డీప్ ఫేక్ వీడియోలు..అసత్య కథనాలు వైరల్ అవుతున్నాయి.
ఇంతకుముందు హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో చాలామంది.. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. అయినప్పటికీ.. ఆ ఘటన తర్వాత కూడా ఏఐ దుర్వినియోగం ఆగలేదు. ఆ తర్వాత కూడా ఎంతోమంది హీరోయిన్స్ ఈ సమస్యలు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు ఇదే సమస్య శ్రీలీలకూ ఎదురైంది. ఇక ఇదే విషయంపై ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ అయ్యింది ఈ హీరోయిన్. సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ..ఏఐతో తయారయ్యే నకిలీ కంటెంట్‌కు మద్దతివ్వొద్దని చెప్పింది. టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేయడానికి ఉండాలి కానీ ఇబ్బంది పెట్టడానికి కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
“నేను చేతులు జోడించి ప్రతి సోషల్ మీడియా యూజర్‌ను ఒకటే కోరుతున్నాను. దయచేసి ఏఐతో తయారయ్యే అర్థంలేని కంటెంట్‌కు మద్దతివ్వకండి. టెక్నాలజీని ఉపయోగించండి.. అంతేగాని దుర్వినియోగం చేయకండి. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. టెక్నాలజీ జీవితం సులభం చేయడానికి ఉండాలి, కష్టం చేయడానికి కాదు” అని స్పష్టంగా చెప్పింది.
అంతేకాదు, సినిమా రంగంలో పనిచేసే ప్రతి అమ్మాయి గురించి కూడా ఆమె మాట్లాడింది. “సినిమా రంగంలో ఉన్న ప్రతి అమ్మాయి ఎవరికో ఒకరి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితురాలు లేదా సహోద్యోగి అయి ఉంటుంది. మేము అందరం కూడా సురక్షిత వాతావరణంలో పని చేస్తున్నామనే నమ్మకంతో ఈ ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నాం. సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆన్‌లైన్‌లో జరుగుతున్న చాలా విషయాలు నాకు తెలియలేదు. వాటిని నా దృష్టికి తీసుకొచ్చిన వారందరికీ ధన్యవాదాలు. సాధారణంగా నేను చిన్న విషయాలను పట్టించుకోను. కానీ ఇది మాత్రం చాలా బాధాకరంగా ఉంది. నా తోటి నటీమణులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు” అని తెలిపింది.
“గౌరవంతో, ప్రేక్షకులపై నమ్మకంతో మీ అందరిని మా వెంట నిలవమని కోరుతున్నాను. ఇకపై ఈ విషయాన్ని అధికారులే చూసుకుంటారు” అని శ్రీలీల తన పోస్ట్‌ను ముగించింది. ఈ క్రమంలో మరోసారి.. సోషల్ మీడియాలో ఏఐ ఫోటోలు షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సినీ అభిమానులు కొందరు కామెంట్లు పెడుతున్నారు.