బడ్జెట్‌లో సగం ఈ హీరోలకే..!
ఒక్కో సినిమాకి 100 కోట్లు అంతకుమించి అందుకుంటున్న టాప్ హీరోల జాబితాను పరిశీలిస్తే ఇలా ఉంది.;
100 కోట్లు అందుకునే స్టార్‌లు కేవలం హిందీ చిత్రసీమలోనే ఉండేవారు. ఖాన్ ల త్రయం పారితోషికం, లాభాల్లో వాటాలు కలుపుకుని అంత పెద్ద మొత్తం అందుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో సీన్ అమాంతం మారిపోయింది. చిరంజీవి మొదలు చాలా మంది తెలుగు స్టార్లు పారితోషికంతో పాటు లాభాల్లో వాటాలు అందుకుంటున్నారు. సినిమా వ్యాపార సరళిని అమాంతం మార్చేసిన సౌత్ స్టార్లను పరిశీలిస్తే ఇందులో అరడజను మంది టాలీవుడ్ నుంచి ఎదిగిన స్టార్లు ఉన్నారు.
ఒక్కో సినిమాకి 100 కోట్లు అంతకుమించి అందుకుంటున్న టాప్ హీరోల జాబితాను పరిశీలిస్తే ఇలా ఉంది. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్లు 100 కోట్లు పైగా అందుకుంటున్న స్టార్ల జాబితాలో ఉన్నారు. అట్లీతో సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ. 200 కోట్లు అందుకుంటున్నారని సమాచారం. అలాగే రాజమౌళితో సినిమా కోసం మహేష్ 180 కోట్లు అందుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ ఒక్కో సినిమా కోసం 180కోట్లు సుమారు అందుకుంటున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంచుమించి 125- 150 కోట్ల మధ్య అందుకుంటున్నారని సమాచారం. ఆర్.ఆర్.ఆర్ స్టార్లుగా వచ్చిన క్రేజ్ తో యంగ్ యమ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేస్తున్నాడు.
అటు కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ 300కోట్ల (లాభాల్లో వాటాలు కలుపుకుని) పారితోషికం అందుకుంటున్నారని, దళపతి విజయ్ తన తదుపరి చిత్రం జననాయగన్ కోసం 270 కోట్లు అందుకుంటున్నాడని ప్రచారం ఉంది. మరోవైపు తళా అజిత్ ఒక్కో చిత్రానికి రూ. 175 కోట్లు అందుకుంటున్నారని కథనాలొస్తున్నాయి. ఇతర స్టార్లు ఎవరూ వీళ్లకు దరిదాపుల్లో లేరు. అయితే బడ్జెట్ అంతా హీరోలకే పోతే, నాణ్యమైన సినిమా తీయడమెలా? అని ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. అలాంటి వారికి సమాధానం రెడీమేడ్‌గా ఉంది.
నిజానికి స్టార్ల సేలబిలిటీని బట్టి, వారికి ఉన్న సక్సెస్ రేటు, ఫాలోయింగ్ ని అనుసరించి ఈ పారితోషికాలు నిర్ణయమవుతాయి. అయితే బడ్జెట్లో సగం పైగా హీరోలకే పారితోషికం రూపంలో చెల్లించడం అంటే అది నిర్మాతలకు సవాళ్లతో కూడుకున్నది. నిర్మాత నేరుగా ఏక మొత్తంగా డబ్బును హీరోలకు ముట్టజెప్పడు. హీరోలు మెజారిటీ వాటాను కేవలం లాభాల నుంచి మాత్రమే తీసుకుంటున్నారు. అంటే సినిమా రిలీజయ్యాక సక్సెసై వచ్చే డబ్బు నుంచి వాటా అందుకుంటున్నారు. అందువల్ల కూడా ఈ ఫార్మాట్ వర్కవుటవుతోంది. ఒకవేళ నష్టాలొస్తే దానిని కూడా హీరోలు భరిస్తారు. ఇటీవలి కాలంలో పరిశ్రమలోని అగ్ర హీరోలంతా సినిమాల నిర్మాణంలో భాగమై నిర్మాతకు అండగా నిలుస్తుండడం ఆసక్తికర పరిణామం.