12 కోట్ల రెంటు ఎంజాయ్ చేస్తున్న గాయ‌కుడు

ముంబై రియ‌ల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబ‌డులు పెట్టేవారిలో కేవ‌లం స్టార్లు మాత్ర‌మే కాదు, స్టార్ సింగ‌ర్లు, సంగీత ద‌ర్శ‌కులు ఉన్నారు.;

Update: 2025-12-11 04:53 GMT

ముంబై రియ‌ల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబ‌డులు పెట్టేవారిలో కేవ‌లం స్టార్లు మాత్ర‌మే కాదు, స్టార్ సింగ‌ర్లు, సంగీత ద‌ర్శ‌కులు ఉన్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్, ఆలియా భ‌ట్, అక్ష‌య్ కుమార్, స‌ల్మాన్, హృతిక్ రోష‌న్ ఇలా పెద్ద స్టార్లు అంద‌రూ ముంబై ఔటర్ లో వేగంగా అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. చూస్తుండ‌గానే ఇవ‌న్నీ ప‌దింత‌లు పెరిగిపోతున్నాయి.

తాజాగా ఈ జాబితాలో ప్ర‌ముఖ గాయకుడు సోను నిగమ్ కూడా చేరాడు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) సమీపంలోని ప్రీమియం క‌మ‌ర్షియ‌ల్ ఆస్తిని ఐదేళ్ల‌ కాలానికి రూ. 12.61 కోట్ల మొత్తం అద్దె అందుకుంటున్నాడు సోను నిగ‌మ్. ఆ మేర‌కు లీజు ఒప్పందం కుదిరింది. లీజుకు ఇచ్చిన ఆఫీస్ స్థలం శాంటాక్రూజ్ తూర్పులోని ట్రేడ్ సెంటర్ బీకేసీలో ఉంది. ఇది దాదాపు 4,257 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ముంబై హాస్పిటాలిటీ సర్క్యూట్‌లో ర‌ద్ధీగా ఉండే ప్రాంతంలో ఈ స్థ‌లం ఉండ‌టంతో దీనికి హై డిమాండ్ ఉన్న‌ట్టు తెలిసింది. సోను నిగ‌మ్ నుంచి ఈ ఆస్తిని పట్నీ హాస్పిటాలిటీ లీజుకు తీసుకుంది. ఈ వారంలోనే లీజు ఒప్పందం జ‌రిగింది. లావాదేవీకి రూ.3.27 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఒప్పందంలో రూ. 90 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉందని తెలిసింది.మొద‌టి సంవ‌త్స‌రానికి అద్దె రూ. 19 లక్షల నుండి ప్రారంభమవుతుంది. రెండవ సంవత్సరం నుండి ఒప్పందంలో 5.26 శాతం అద్దె పెరుగుతుంది. నెలవారీ అద్దె 2వ సంవత్సరంలో దాదాపు రూ. 20 లక్షలకు చేరుకుంటుంది. మిగిలిన లీజు వ్యవధిలో దామాషా ప్ర‌కారం పెంపుద‌ల ఉంటుంది.

ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ త‌న ఆఫీస్ కార్యాల‌యాల కోసం కోట్లాది రూపాయ‌లు వెచ్చించాడు. అదే తీరుగా అమితాబ్- అభిషేక్ ముంబై ఔట‌ర్ లో స్థ‌లాలు కొనుగోలు చేయ‌డంలో, అపార్ట్ మెంట్ల‌లో పెట్ట‌బడులు పెట్ట‌డంలో ముందున్నారు. చాలా మంది గాయ‌నీమ‌ణులు త‌మ భారీ పారితోషికాల‌ను రియ‌ల్ ఎస్టేట్ లో పెడుతున్నారు. టాలీవుడ్ నుంచి ప‌లువురు అగ్ర క‌థానాయ‌కులు కూడా ముంబైలో భారీ పెట్టుబ‌డులు పెట్టార‌ని కూడా తెలుస్తోంది.

ఊహించ‌ని వివాదంలో..

ఇటీవ‌ల సోను నిగ‌మ్ పేరు ఓ వివాదంలో ప్ర‌ముఖంగా వినిపించింది. బెంగ‌ళూరులోని ఓ లైవ్ క‌చేరీలో క‌న్న‌డ పాట‌ల్ని పాడాల్సిందిగా ఒక అభిమాని సోనూ సూద్ ని అభ్య‌ర్థించాడు. కానీ సోనూ సూద్ దానికి దురుసుగా స‌మాధాన‌మిచ్చార‌ని ఆరోప‌ణ‌లొచ్చాయి. ``క‌న్న‌డ క‌న్న‌డ అంటూ ఇలాంటి విభేధాల‌తోనే ప‌హ‌ల్గామ్ దాడి జ‌రిగింది`` అంటూ సోనూ నిగ‌మ్ అభిమానిపై సీరియ‌స్ అయిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. కార‌ణం ఏదైనా క‌న్న‌డ భాష‌కు అవ‌మానం జ‌రిగిందంటూ అత‌డిపై ప‌లు చోట్ల కేసులు నమోద‌య్యాయి. సోను నిగ‌మ్ దీనికి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పోలీసులు నోటీసులు పంపారు.

సోను నిగ‌మ్ పై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో క‌న్న‌డ సినీప‌రిశ్ర‌మ అన‌ధికారిక స‌హాయ‌నిరాక‌ర‌ణ‌ను అమ‌లు చేసింది. అత‌డికి క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు రాకుండా అడ్డుకున్నారు. కన్నడ చిత్రం `కులదల్లి కీల్యావుడో` నుండి నేపథ్య గాయకుడు సోను నిగమ్ పాటను కూడా తొలగించారు. అయితే గాయకుడు సోను నిగ‌మ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కర్ణాటక ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పినా కానీ అత‌డిని విడిచిపెట్ట‌లేదు. సోను నిగమ్ మంచి గాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇటీవల ఒక కచేరీలో అతను కన్నడ గురించి మాట్లాడిన తీరు మాకు చాలా బాధ కలిగించిందని, సోను నిగమ్ కన్నడకు చేసిన అవమానాన్ని మేము సహించలేము కాబట్టి పాటను తొలగించామ‌ని నిర్మాత‌లు ఒక‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:    

Similar News