AR రెహమాన్ గొప్ప సంగీతజ్ఞుడే కానీ..!

దశాబ్దాలుగా రెహమాన్‌తో కలిసి పనిచేసిన సోను.. రెహమాన్ తన స్వరాన్ని ఎప్పుడూ తన బలమైన ఆస్తిగా భావించ‌లేదని అన్నారు. అత‌డు శిక్షణ పొందిన గాయకుడు కాదు.. అతడి స్వరం చాలా బాగుంటుంది.;

Update: 2025-12-06 23:30 GMT

స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్.రెహ‌మాన్ గొప్ప సంగీత ద‌ర్శ‌కుడే కానీ, అత‌డు గొప్ప గాయ‌కుడు కాదని నేను న‌మ్ముతాను! అని అన్నారు ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌కుడు సోను నిగ‌మ్. దాదాపు రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా రెహ‌మాన్ తో క‌లిసి ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌ల‌కు ప‌ని చేసిన సోను నిగ‌మ్ ఇలాంటి కామెంట్ చేయ‌డం చాలా సంచ‌ల‌నం సృష్టించింది. ``రెహ‌మాన్ కాబ‌ట్టి పాడ‌గ‌ల‌డు కానీ, అత‌డు శిక్ష‌ణ పొందిన గాయ‌కుడు కానే కాద‌``ని సోను నిగ‌మ్ బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు.

రెహ‌మాన్ గొప్ప స్వ‌ర‌కర్త అని అంగీక‌రిస్తూనే, అత‌డిలోని గాయ‌కుడిని సోను నిగ‌మ్ త‌క్కువ చేసి మాట్లాడ‌టం నిజంగా విస్మ‌యం క‌లిగించింది. అయినా ఈ మాట‌ల‌లో నిజాయితీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. రెహ‌మాన్ లోని బ‌లాల‌ను, బ‌ల‌హీన‌త‌ను కూడా అతడు బ‌హిర్గ‌తం చేసాడు.

దశాబ్దాలుగా రెహమాన్‌తో కలిసి పనిచేసిన సోను.. రెహమాన్ తన స్వరాన్ని ఎప్పుడూ తన బలమైన ఆస్తిగా భావించ‌లేదని అన్నారు. అత‌డు శిక్షణ పొందిన గాయకుడు కాదు.. అతడి స్వరం చాలా బాగుంటుంది. కానీ అత‌డు తనను తాను గొప్ప గాయకుడిని అని చెప్పుకోడు..అని సోను వ్యాఖ్యానించారు.

సంపూర్ణంగా శ్రుతిలో ఉండగల సామర్థ్యం అత‌డి గొప్ప‌త‌నం అని సోను నొక్కి చెప్పారు. ఆయన ఎల్లప్పుడూ సుర్ లోనే ఉంటారు. `సుర్`(వేగం)లో లేకపోతే మంచి స్వర నిర్మాణం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆయన స్వరం గొప్పగా ఉండకపోవచ్చు.. కానీ ఆయన ఎల్లప్పుడూ సుర్ లోనే ఉంటారు.. ఎందుకంటే ఆయన ఏఆర్ రెహమాన్ క‌దా! అని వ్యాఖ్యానించారు.

జోధా అక్బర్ పాట `ఇన్ లమ్హోన్ కే దామన్ మే` రికార్డింగ్ స‌మ‌యంలో కొంత భాగాన్ని తాను కంపోజ్ చేసేందుకు అకాశం కల్పించార‌ని సోను తెలిపారు. రెహ‌మాన్ కంపోజిష‌న్ ముగిశాక లిరిసిస్ట్ జావేద్ అక్త‌ర్ పాటకు అద‌న‌పు పంక్తుల‌ను చేర్చారు. ఆ చిన్న భాగానికి సంగీతం అందించే బాధ్య‌త‌ను నాకు అప్ప‌గించార‌ని సోను గుర్తు చేసుకున్నారు. సోను చెప్పిన‌ది విని రెహమాన్ దానిని తక్షణమే ఆమోదించాడు. ఆయన కొన్ని విషయాల్లో మార్పులు చేసి ఉండాలి.. కానీ ఈ భాగంలో పని చేయడానికి న‌న్ను అనుమతించారు... ఆయన చాలా సురక్షితంగా ఉన్నారు! అని కూడా సోను వ్యాఖ్యానించారు.

సోను నిగమ్ - ఎఆర్ రెహమాన్ కొన్ని చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌ల‌కు క‌లిసి ప‌ని చేసారు. సత్రంగీ రే (దిల్ సే), ఇష్క్ బినా (తాల్), గుజారిష్ (ఘజిని), చోటి సి ఆషా (రోజా) , ఆయో రే సఖి (నీరు) వంటి పాథ్ బ్రేకింగ్ పాట‌ల‌ను ఈ జోడీ అందించారు.

Tags:    

Similar News