డిజిటల్ స్క్రీన్ల వెనుక దుఃఖం!

ఒకవేళ అలా చేయకపోతే? వారికి తమ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ లేదని కెరీర్ గురించే ఆలోచిస్తు న్నారంటూ నెగెటివ్ కామెంట్లు చేయడం, ట్రోలింగ్‌కు గురిచేయడం ప‌రిపాటిగా మారుతోంది.

Update: 2026-05-22 12:30 GMT

నేటి డిజిటల్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారింది. సామాన్య ప్రజల నుండి సినిమా తారల వరకు ప్రతి ఒక్కరి జీవితం ఇంటర్నెట్ వేదికగా బహిరంగమవడంతో? సంతోషాలతో పాటు వ్యక్తిగత దుఃఖాన్ని కూడా కొందరు తప్పుగా విశ్లేషించే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. సెలబ్రిటీల కుటుంబాల్లో విషాధాలు చోటు చేసుకుంటున్న‌ స‌మ‌యంలో సదరు తారలు సోషల్ మీడియాలో ఎలా స్పందిస్తున్నారనే అంశంపై నెటిజన్లు నిఘా పెట్టడం అన్న‌ది విచారకరమైన ట్రెండ్‌గా మారింది. సాధారణంగా ఒక సెలబ్రిటీకి అత్యంత ఆప్తులైన వారు దూరమైనప్పుడు ఇన్‌స్టాగ్రామ్ , ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లలో సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్టులు పెట్టడం లేదా కన్నీటితో కూడిన ఫోటోలను పంచుకోవాలని కొందరు నెటిజన్లు ఆశిస్తున్నారు.

ఒకవేళ అలా చేయకపోతే? వారికి తమ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ లేదని కెరీర్ గురించే ఆలోచిస్తున్నారంటూ నెగెటివ్ కామెంట్లు చేయడం, ట్రోలింగ్‌కు గురిచేయడం ప‌రిపాటిగా మారుతోంది. దుఃఖాన్ని వ్యక్త పరచడానికి సోషల్ మీడియా పోస్టులే ప్రామాణికం అనేలా నేటి సమాజం ఆలోచించడం శోచ‌నీయం. ప్రతి మనిషికి బాధను అనుభవించడానికి దాని నుండి కోలుకోవడానికి భిన్నమైన శైలి ఉంటుంది. కొందరు తమ దుఃఖాన్ని బహిరంగంగా పంచుకుని ఊరట పొందితే? మరికొందరు తమ ఆప్తుల మధ్య ఏకాంతంగా ఉండి వేదనను భరించడానికి ఇష్టపడతారు.

సెలబ్రిటీలు అయినంత మాత్రాన తమ గుండెకోతను ప్రపంచానికి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఫిగర్స్ అయినా? వారి వ్యక్తిగత జీవితంలోని అత్యంత బాధాకరమైన క్షణాలను ఎలా ఎదుర్కొంటారనేది పూర్తిగా వారి వ్యక్తిగత హక్కు. ఈ విధమైన సైబర్ సంస్కృతి వల్ల నటీనటులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఓ స‌ర్వేలో తేలింది. తమ ఆత్మీయులను కోల్పోయిన బాధలోనే సమాజం ,మీడియా తమను ఎలా జడ్జ్ చేస్తాయోననే ఆందోళన వెంటాడుతోంది. ప్రజాదరణ ఉన్న వ్యక్తులు కూడా మనుషులేనని, వారికీ భావోద్వేగాలు, కన్నీళ్లు ఉంటాయని గుర్తించడంలో కొంద‌రు సోషల్ మీడియా యూజర్లు విఫలమవుతున్నారు.

తారల వ్యక్తిగత విషాదాలను కంటెంట్‌గా , గాసిప్స్‌గా మార్చడం మానవత్వానికే మచ్చగా మారుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఇంటర్నెట్ ప్రపంచంలో కొంద‌రు నెటిజన్లు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ ఎమోషన్స్‌ను వేర్వేరుగా చూడాల‌ని సామాజిక సంస్థ‌లు విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. కష్ట కాలంలో వారికి కావలసినంత సమయాన్ని, ప్రైవసీని ఇవ్వడమే వారికి ఇచ్చే నిజమైన గౌరవం. డిజిటల్ స్క్రీన్ల వెనుక ఉండే సెలబ్రిటీల మనోభావాలను గౌరవించినప్పుడే ఆరోగ్యకరమైన సోషల్ మీడియా సమాజం ఏర్పడుతుందన్న‌ది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News