నా నటన చెత్తగా ఉందన్నా భయపడను!
రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన డార్క్ కామెడీ చిత్రం 'సిస్టర్ మిడ్ నైట్' మే 30న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది.;
రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన డార్క్ కామెడీ చిత్రం 'సిస్టర్ మిడ్ నైట్' మే 30న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది. ఏడాది క్రితం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ అయిన తర్వాత ఈ చిత్రం పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించారు. ఇంతకాలానికి భారతదేశంలో విడుదలకు వస్తోంది. కరణ్ కాంధారి దర్శకత్వం వహించారు. ముంబైలోని ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో జీవితాన్ని గడుపుతున్న కొత్తగా పెళ్లైన ఉమా కథేమిటో తెరపైనే చూడాలి. దోమ కుట్టిన తర్వాత ఆమెలో వింత మార్పులకు లోనవుతుంది. పెళ్లి తర్వాత పడతిలో మార్పులేమిటన్నది తెరపైనే చూడాలి.
సిస్టర్ మిడ్‌నైట్ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న చిత్రం. రోటెన్ టొమాటోస్ లో 96 శాతం స్కోరును సాధించడం అరుదైన ఘనత. ఈ చిత్రం కేన్స్‌లో కెమెరా డి ఓర్ కేటగిరీలో అలాగే బాఫ్టా- 2025లో అత్యుత్తమ ఆరంగేట్రానికి నామినేషన్‌ను గెలుచుకుంది.
ఇదిలా ఉంటే, రాధిక ఆప్టే ఇన్ స్టాలో 'సిస్టర్ మిడ్ నైట్' చిత్రానికి కావాల్సినంత ప్రమోషన్స్ చేస్తోంది. నీలో మార్పు వచ్చే లోపు నువ్వు ఒక గేమ్ ని ప్లాన్ చేయాలి అని తాజా క్యాప్షన్ లో రాధిక ఆప్టే రాసింది. తాజాగా ఇన్ స్టాలో 'సిస్టర్ మిడ్ నైట్' పోస్టర్ ని షేర్ చేసిన ఆప్టే క్యాప్షన్ లో ఇలా రాసింది. "నేను విఫలమవడానికి అస్సలు భయపడను. నా సినిమా చెత్తగా ఉందని, లేదా నా నటన చెత్తగా ఉందని చెప్పేవారికి నేను భయపడను. ఎవరు ఏ కామెంట్ చేసినా ఫర్వాలేదు.. ఇది నా ప్రయాణంలో ఒక భాగం!" అని ఆప్టే నోట్ లో రాసింది.