చెప్తే అన్నీ చెప్పు.. ప్ర‌వ‌స్తి ఆరోప‌ణ‌ల‌పై సునీత

పాడుతా తీయ‌గా ప్రోగ్రామ్‌పై, ఆ షో లో జ‌డ్జీలుగా ఉన్న కీర‌వాణి, సునీత, చంద్ర‌బోస్ పై ప్ర‌వ‌స్తి చేసిన ఆరోప‌ణ‌లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి;

Update: 2025-04-22 13:44 GMT

గ‌త రెండ్రోజులుగా సింగ‌ర్ ప్ర‌వ‌స్తి ట్రెండింగ్ లో ఉంది. పాడుతా తీయ‌గా ప్రోగ్రామ్‌పై, ఆ షో లో జ‌డ్జీలుగా ఉన్న కీర‌వాణి, సునీత, చంద్ర‌బోస్ పై ప్ర‌వ‌స్తి చేసిన ఆరోప‌ణ‌లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. త‌న‌ను షో నుంచి అన్యాయంగా ఎలిమినేట్ చేయ‌డంతో పాటూ బాడీ షేమింగ్ కూడా చేశార‌ని ఆరోపించింది ప్ర‌వ‌స్తి. త‌న‌మీద ప్ర‌వ‌స్తి చేసిన ఆరోప‌ణ‌ల‌పై సింగ‌ర్ సునీత రియాక్ట్ అవుతూ వీడియోను రిలీజ్ చేసింది.

నిన్నటి నుంచి టీవీల్లో, సోష‌ల్ మీడియాలో ఒక‌టే డిస్క‌ష‌న్ జ‌రుగుతుంద‌ని, పాడుతా తీయ‌గా ప్రోగ్రామ్, అందులోని జ‌డ్జిలు, జ్ఞాపిక ప్రొడ‌క్ష‌న్స్ అంటూ మొద‌లుపెట్టిన సునీత, ప్ర‌వ‌స్తి డైరెక్ట్ గా త‌న పేరు చెప్పింది కాబ‌ట్టే క్లారిటీ ఇస్తున్నాన‌ని తెలిపింది. చిన్న‌ప్ప‌టి నుంచి నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేశా క‌దా ప్ర‌వ‌స్తి, ఇప్పుడు నీకు 19 ఏళ్లు వ‌చ్చాక కూడా ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బావుండ‌ద‌ని, చిన్న‌ప్పుడు నువ్వు చాలా ముద్దుగా పాడావ‌ని చాలా సార్లు పొగిడా. ఇప్పుడు కూడా నువ్వు అలానే మెయిన్‌టెయిన్ చేస్తూ పాడుంటే సంతోషించే వాళ్ల‌తో మొద‌టి వ్య‌క్తిని నేనే , ఎందుకంటే మా ప్ర‌వ‌స్తి బాగా పాడింద‌ని మురిసిపోయే పిచ్చిదాన్ని అని సునీత చెప్పింది.

షో లో ఎవ‌రు బాగా పాడితే ఆ సాంగ్ లో క‌రిగిపోయి క‌న్నీటిప‌ర్యంతం అయిపోయి ఏడ్చిన సిట్యుయేష‌న్స్ కూడా ఉన్నాయ‌ని, నువ్వు ఆ వీడియోలు చూడ‌లేదేమో అని ప్ర‌వ‌స్తిని సునీత అడిగింది. అప్పుడు చిన్నగా ముద్దుగా ఉండే ప్ర‌వ‌స్తి ఇవాళ ఇంత పెద్ద‌దైపోయి, రోడ్డు మీద‌కెళ్లి మా గురించి చ‌ర్చించే స్థాయికి వ‌చ్చిందంటే త‌నకు అసంతృప్తిగా ఉంద‌ని సునీత అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

పాడుతా తీయ‌గా తో పాటూ ఎన్నో సింగింగ్ కాంపిటేష‌న్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్ర‌వ‌స్తిని షో కు ఉండే ప్రాసెస్ తెలీదా అని ప్ర‌శ్నించింది. సింగ‌ర్స్ సెలెక్ట్ చేసిన సాంగ్స్ లో కూడా రైట్స్ ను బ‌ట్టి మ‌ళ్లీ సెలెక్ట్ చేయాల్సి వ‌స్తుంద‌ని, ఈ విష‌యం నీకు తెలుసు క‌దా, ఆడియ‌న్స్ కు కూడా ఈ విష‌యాన్ని తెలిసేలా చెప్ప‌మ్మా.. చెప్తే అంతా చెప్పు. ప్రోగ్రామ్ కు ఉండే ప్రాసెస్, రూల్స్, రిస్ట్రిక్ష‌న్స్ గురించి మాట్లాడితే అప్పుడు నిజంగా సంతోషిస్తా అని సునీత మాట్లాడింది.

ప్రతీ విష‌యానికీ నువ్వు అప్‌సెట్ అవుతున్నావు ప్ర‌వ‌స్తీ, వేరే సింగ‌ర్స్ అంటే నాకు ఇష్ట‌మ‌ని అంటున్నావు, కానీ నువ్వు త‌ప్ప మ‌రెవ‌రూ నాతో క‌లిసి ఆల్బ‌మ్ కు పాడ‌లేదు. నువ్వంటే ఇష్టం లేక‌పోతే నేను నీతోనే ఎందుకు ఆ వీడియో చేస్తాను? ఇవ‌న్నీ మ‌ర్చిపోయి బ‌య‌ట‌కొచ్చి నువ్వు ఇలా మాట్లాడ‌టం త‌ప్పు అని సునీత ప్ర‌వ‌స్తికి అర్థ‌మయ్యేలా మాట్లాడింది.

మీ అమ్మగారిని నువ్వు అన‌డం నిన్ను బాధించింద‌ని, అది సంస్కారం కాద‌ని నువ్వు అంటున్నావు. మ‌రి ఎలిమినేష‌న్ రోజు మీ అమ్మ‌గారు న‌న్ను ఉద్దేశించి నా మొహం వైపు చెయ్యి చూపిస్తూ నువ్వే దీనికి కార‌ణం అంటూ తిట్టింది. అది నీకు క‌రెక్ట్ గానే అనిపించిందా అని ప్ర‌శ్నించింది. నువ్వు చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలే అని ప్రూవ్ చేసే ఛాన్స్ ఉన్న‌ప్ప‌టికీ నువ్వు బాధ‌లో ఉన్నావు కాబ‌ట్టి దాని గురించి త‌ర్వాత మాట్లాదామ‌నుకున్నాన‌ని, ఎవ‌రైనా ఓడిపోయి ఏడుస్తుంటే కూర్చుని సంతోషించేంత నీచ‌మైన క్యారెక్ట‌ర్ త‌న‌ది కాద‌ని సునీత ఈ సంద‌ర్భంగా ప్ర‌వ‌స్తిని ఉద్దేశించి మాట్లాడింది.

కాంపిటీష‌న్స్ లో ఓట‌మి, గెలుపు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని, ఎవ‌రైనా స‌రే ఓట‌మిని అంగీక‌రించాల్సిందేన‌ని, ఓట‌మిని అంగీక‌రిస్తేనే జీవితంలో మ‌రిన్ని నేర్చుకునే అవ‌కాశ‌ముంటుంద‌ని, అంగీక‌రించ‌లేక‌పోతే ఏం నేర్చుకోలేర‌ని, సీనియ‌ర్స్ ను గౌరవించ‌డంతో పాటూ వారి నుంచి కొన్ని విష‌యాలు నేర్చుకోవాల‌ని, తామెన్నో పాటలు పాడామ‌ని, వాటిని తీసేసిన సంద‌ర్భాలున్న‌ప్ప‌టికీ ఎప్పుడూ బ‌య‌టికొచ్చి విమ‌ర్శ‌లు చేయ‌లేదని, ఇప్ప‌టికైనా ఓట‌మిని అంగీక‌రించి త్వ‌ర‌గా దాన్నుంచి బ‌య‌టికొచ్చి మంచి గురువు ద‌గ్గ‌ర మ్యూజిక్ నేర్చుకుని జీవితంలో పైకి ఎద‌గాల‌ని కోరుకుంటున్న‌ట్టు ప్ర‌వ‌స్తికి చెప్పింది సునీత. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Tags:    

Similar News