వ్యక్తిగత జీవితంపై చర్చ అనవసరం.. విజయ్ పార్టీ అధికారిక ప్రకటన!
తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా విస్త్రతమైన ప్రచారం సాగుతోంది.;
తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా విస్త్రతమైన ప్రచారం సాగుతోంది. ఆయన విడాకుల గురించి సోషల్ మీడియా సహా కొన్ని ప్రధాన వార్తా సంస్థల్లో వస్తున్న వార్తలపై విజయ్ స్థాపించిన `తమిళగ వెట్రి కజగమ్` (టీవీకే) పార్టీ తొలిసారిగా అధికారికంగా స్పందించింది. తమ నాయకుడి గురించి సాగుతున్న ఈ ప్రచారంపై పార్టీ వర్గాలు అత్యంత స్పష్టమైన, కచ్చితమైన ప్రకటనను విడుదల చేస్తూ... అనవసరమైన ఊహాగానాలకు ముగింపు పలకాలని ప్రయత్నించాయి.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో తమ నాయకుడి వ్యక్తిగత జీవితం గురించి చర్చించడం పూర్తిగా 'అనవసరం' అని పార్టీ కుండబద్ధలు కొట్టింది. ఎవరికైనా వ్యక్తిగత విషయాలు కేవలం వారికి మాత్రమే సంబంధించినవని.. వాటిని అందరూ గౌరవించాల్సిన బాధ్యత ఉందని పార్టీ గుర్తుచేసింది. ఒక వ్యక్తి వ్యక్తిగత ఎంపికలు లేదా నిర్ణయాలను బహిరంగ చర్చల్లోకి లాగడం సరికాదని.. ప్రతి ఒక్కరి ప్రైవసీని కాపాడటం ప్రజాస్వామ్యంలో కనీస ధర్మమని పార్టీ అభిప్రాయపడింది.
ప్రస్తుతం పార్టీ దృష్టి మొత్తం కేవలం ప్రజా సేవ, రాజకీయ కార్యకలాపాలపైనే ఉందని టీవీకే స్పష్టం చేసింది. వ్యక్తిగత విషయాల కంటే ప్రజలపై ప్రభావం చూపే అతిపెద్ద సామాజిక సమస్యలు ఎన్నో ఉన్నాయని.. వాటిపై చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వచ్చే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఇది పార్టీ విధానాలు.. సుపరిపాలన.. ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన సమయమే తప్ప.. ఇలాంటి పుకార్ల గురించి కాదని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.
మద్దతుదారులు, సామాన్య ప్రజలు ఇలాంటి వ్యక్తిగత అంశాల వైపు మళ్ళి పక్కదారి పట్టవద్దని పార్టీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. సమాజానికి మేలు చేసే రాజకీయ లక్ష్యాల సాధనపైనే అందరూ ఏకాగ్రత వహించాలని పిలుపునిచ్చింది. రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరించాలని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ తదుపరి అజెండా అని పార్టీ స్పష్టం చేసింది. ఈ స్పందన ద్వారా ప్రజల దృష్టిని మళ్ళీ కీలకమైన రాజకీయ అంశాల వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తోంది.
అయితే పార్టీ ఈ స్థాయిలో స్పందించినప్పటికీ దళపతి విజయ్ మాత్రం తన వ్యక్తిగత జీవితంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఆయన మౌనంగానే ఉన్నా.. పార్టీ మాత్రం తమ ప్రాధాన్యత 2026 ఎన్నికల పోరాటం, ప్రజాసంక్షేమమే అని చాటి చెప్పింది. ఈ అధికారిక ప్రకటనతో గందరగోళంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఒక స్పష్టత వచ్చినట్లయింది. రాబోవు తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలుపును ఈ గందరగోళం ప్రభావితం చేయబోతోందా? వేచి చూడాలి.