సిద్ శ్రీరామ్.. ఒకప్పటి డిమాండ్ ఇప్పుడు ఏదీ!
| ఒకప్పుడు తెలుగు సినిమా సంగీతంలో సిద్ శ్రీరామ్ హవా కొనసాగేది. 'శ్రీవల్లి', 'కళావతి', 'సామజవరగమన' వంటి పాటలతో చార్ట్‌బస్టర్స్ అందుకున్న ఆయనకు ఇప్పుడు గతంలో ఉన్నంత డిమాండ్ కనిపించడం లేదు. మెలోడీలకు బదులుగా ఫోక్, మాస్ బీట్స్‌కు ప్రాధాన్యం పెరగడం, కొత్త గాయకులకు అవకాశాలు రావడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇతర భాషల్లోనూ పాటలు పాడుతూ, లైవ్ కాన్సర్ట్స్, సొంత మ్యూజిక్‌పై దృష్టి పెడుతున్నారు.
తెలుగు సినిమాల్లో ఒకప్పుడు సిద్ శ్రీరామ్ హవా మామూలుగా ఉండేది కాదు. చిన్న సినిమా అయినా, పెద్ద హీరో సినిమా అయినా ఆయనతో ఒక్క మెలోడీ పాట పాడించాలని మ్యూజిక్ డైరెక్టర్లు ప్రయత్నించేవారు. కొన్ని సినిమాలకు సిద్ పాడిన పాటలే విడుదలకు ముందు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. అప్పటిలా వరుసగా సిద్ శ్రీరామ్ పాటలు వినిపించడం లేదు. ఇటీవల ఆయన పాడిన కొన్ని పాటలు విడుదలైనా గతంలో ఉన్నంత సందడి మాత్రం కనిపించడం లేదు.
'ఇంకేం ఇంకేం కావాలే', 'మాటే వినదుగా', 'సామజవరగమన', 'నీలి నీలి ఆకాశం', 'శ్రీవల్లి', 'కళావతి'.. ఇలా సిద్ పాడిన పాటలు వరుసగా చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాల్లో ఆయన గొంతుకు ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడింది. ఒక్క పాటకు రూ.10-12 లక్షల వరకు పారితోషికం తీసుకునేవారని అప్పట్లో టాక్ వచ్చింది. అంత మొత్తం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు ఆసక్తి చూపించారంటే ఆయన పాటలకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇటీవల కూడా సిద్ కొన్ని తెలుగు పాటలు పాడారు. 2025లో నాని 'హిట్ 3' కోసం 'ప్రేమ వెల్లువ' పాట అందించారు. ఈ ఏడాది వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'లో 'కంసహమ్నిదా', శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'లో 'ఒరియా పిల్ల' పాటలు పాడారు. కానీ ఒకప్పుడు 'శ్రీవల్లి', 'కళావతి' వంటి పాటలకు వచ్చిన స్థాయి గుర్తింపు వీటికి దక్కలేదు.
మరోవైపు తెలుగు సినిమా సంగీతంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో మెలోడీ పాటలతోనే సినిమాలకు మంచి బజ్ దక్కేది. ఇప్పుడు ఫోక్, మాస్ బీట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో లాంటి సంగీత దర్శకులు అలాంటి పాటలతో వరుస విజయాలు అందుకుంటున్నారు. మెలోడీల విషయంలోనూ కొత్త గాయకులను ప్రయత్నిస్తున్నారు. దీంతో గతంలో సిద్ శ్రీరామ్‌కు వెళ్లిన పాటలు ఇప్పుడు వేర్వేరు సింగర్లకు దక్కుతున్నాయి.
సిద్ శ్రీరామ్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ పాటలు పాడుతున్నారు. మరోవైపు సొంతంగా మ్యూజిక్ డైరెక్షన్ అవ్వాలనే ప్లాన్ లో ఉన్నట్లు టాక్ వస్తోంది. లైవ్ కాన్సర్ట్‌లు బాగానే నిర్వహిస్తున్నారు. విదేశాల్లోనూ ఆయన ప్రదర్శనలకు మంచి ఆదరణ ఉంది. సినిమా పాటలతో పాటు తన సొంత మ్యూజిక్ ఆల్బమ్స్పైనా సమయం కేటాయిస్తున్నారు.
ఇక తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో సిద్ శ్రీరామ్ తర్వాత చాలామంది గాయకులకు అవకాశాలు పెరిగాయి. విజయ్ బుల్గానిన్ వంటి సంగీత దర్శకులు కొత్త వాయిస్ లతో మెలోడీలు రూపొందిస్తున్నారు. అదే సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో మాస్ సాంగ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. ఒకప్పుడు సినిమా ఆల్బమ్‌లో సిద్ శ్రీరామ్ పాట ఉందంటే స్పెషల్ గా ప్రచారం చేసేవారు. కాని ఇప్పుడు ఆ వాతావరణం లేదు. మరి రానున్న.రోజుల్లో సిద్ నుంచి ఏదైనా మ్యాజికల్ సాంగ్ వస్తుందేమో చూడాలి.