దత్తత తీసుకుంటా.. కానీ అలా కాదు!
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతి హాసన్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.;
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతి హాసన్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసి ఆడియన్స్ ను అలరిస్తూ వస్తోన్న శృతి హాసన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమాలో నటించారు. కూలీ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్ గా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ప్రేమ గురించి, వ్యక్తిగత జీవితం గురించి, తాను తల్లి కావాలనుకుంటున్న విషయం గురించి మాట్లాడి వార్తల్లో నిలిచారు శృతి హాసన్. శృతికి రెండు సార్లు లవ్ లో బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. మొదట్లో లండన్ కు చెందిన మైఖేల్ కోర్సెల్ తో చాలా కాలం పాటూ ప్రేమలో ఉన్న శృతి మనస్పర్థల కారణంగా అతన్నుంచి విడిపోయారు.
ఆ తర్వాత శాంతను హజారికాతో శృతి మూడేళ్ల పాటూ లవ్ లో ఉన్నారు. శాంతనతో ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకునే శృతికి మరోసారి బ్రేకప్ తప్పలేదు. అయితే రిలేషన్ లో ఉన్నప్పుడూ ఎప్పుడూ జంటగానే కనిపించే శృతి గత కొంత కాలంగా ఒంటరిగానే కనిపిస్తున్నారు. దీంతో అందరికీ వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందని క్లారిటీ వచ్చింది. కానీ ఈ విషయంలో శృతి మాత్రం ఎప్పుడూ బయటపడి మాట్లాడింది లేదు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం శృతి శాంతనుతో విడిపోయినట్టు క్లారిటీ ఇచ్చారు. పెళ్లంటే అంత ఈజీ కాదని, పెళ్లి అంటే ఇద్దరి మధ్య బాధ్యతలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని చెప్పిన శృతి పెళ్లి పై తనకు గౌరవం ఉందని చెప్తున్నారు.
అయితే అదే ఇంటర్వ్యూలో శృతి మదర్‌హుడ్ గురించి కూడా మాట్లాడారు. ఏదొక రోజు తాను పేరెంట్స్ అవాలనుకుంటున్న మనసులోని కోరికను కూడా ఆమె బయటపెట్టారు. ప్రేమపై నమ్మకం కుదరక ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే దత్తత తీసుకుంటానని కూడా శృతి చెప్పారు. అలా అని సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని పెంచనని కూడా శృతి తెలిపారు.
సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో తాను చూశానని, పిల్లలకు తల్లీ, తండ్రి ఇద్దరి ప్రేమ అవసరమని, అన్నీ సందర్భాల్లో వారిద్దరూ పిల్లలతోనే ఉండాలనుకుంటానని, ఈ విషయంలో తాను చాలా క్లారిటీగా ఉన్నానని శృతి తెలిపారు. కాగా శృతి హాసన్ తల్లీతండ్రీ కలిసి ఉండరనే విషయం తెలిసిందే. తల్లిదండ్రులు పిల్లల్ని కలిసి పెంచకపోతే పిల్లలపై ఆ ఎఫెక్ట్ చాలా ఉంటుందని శృతి గతంలో పలుమార్లు చెప్పారు.