సినిమాల మధ్య పోటీ.. అంతా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది
సినీ ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ బాగా ఎక్కువైపోతుంది. ఒకే రోజు ఎక్కువ సినిమాలు, మరీ ముఖ్యంగా రెండు పెద్ద సినిమాలు రిలీజవడం కూడా ఈ మధ్య తరచూ జరుగుతూ వస్తుంది.;
సినీ ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ బాగా ఎక్కువైపోతుంది. ఒకే రోజు ఎక్కువ సినిమాలు, మరీ ముఖ్యంగా రెండు పెద్ద సినిమాలు రిలీజవడం కూడా ఈ మధ్య తరచూ జరుగుతూ వస్తుంది. దీని వల్ల ఆయా సినిమాల ఓపెనింగ్స్, కలెక్షన్లపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందనే విషయం తెలిసిందే. దాంతో పాటూ రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజైతే ఆడియన్స్ కూడా ఏ సినిమా చూడాలా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు.
ఈ విషయాలన్నీ దర్శకనిర్మాతలకు తెలిసినప్పటికీ మరో దారి లేక వేరే సినిమాలతో పోటీ పడుతున్నారు. ఇప్పుడు అలాంటి పోటీ మరోటి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎదురవబోతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమాతో పాటూ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వార్2 సినిమా కూడా ఆగస్ట్ 14నే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ కు భారీ అంచనాలున్నాయి. లోకేష్ దర్శకత్వంలో మొదటిసారి రజినీ చేస్తున్న సినిమా కావడంతో పాటూ ఆ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో కూలీ కోసం మూవీ లవర్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వార్2 పై కూడా అదే రేంజ్ హైప్ ఉంది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తున్న మొదటి సినిమా కావడంతో పాటూ హృతిక్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు పెద్ద నటులు నటించిన సినిమా అవడంతో వార్2 పై కూడా భారీ అంచనాలున్నాయి.
దీంతో ఆగస్ట్ 14న వార్2, కూలీ సినిమా మధ్య పోటీ చాలా గట్టిగా ఉండబోతుందని అర్థమవుతుంది. కాగా ఈ పోటీపై తాజాగా కూలీ సినిమాలో కీలక పాత్రలో నటించిన శృతి హాసన్ మాట్లాడారు. బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడటం కామనే అని, తాను నటించిన సినిమాలు వేరే స్టార్ హీరోల సినిమాలకు పోటీగా చాలా సార్లు రిలీజయ్యాయని శృతి అన్నారు.
కొన్ని సినిమాలు అనుకున్న టైమ్ కే రిలీజవాలని, గతంలో తాను నటించిన సలార్ కు పోటీగా డంకీ మూవీ రిలీజైందని, అయితే ఎన్ని సినిమాలు రిలీజైనా దేని ప్రత్యేకత దానికి ఉంటుందని, ఈ పోటీ విషయంలో నటీనటులేమీ చేయలేరని, నిర్మాతలే ఈ విషయంలో ఆలోచించి సినిమాకీ సినిమాకీ మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలని శృతి అన్నారు. కూలీ, వార్2 రెండు సినిమాల కోసం ఆడియన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారని, ఆడియన్స్ కు రెండు సినిమాలనూ చూడ్డానికి టైమ్ ఇవ్వాలి కదా అని శృతి అభిప్రాయపడ్డారు. సినిమాల పోటీపై శృతి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.