లెజెండ్ ముందు గానం కాళ్లు చేతులు ఒణికాయి!
మల్టీ టాలెంటెడ్ స్టార్ శృతి హాసన్ నటిగానే కాదు. అద్భుతమైన గాయనిగా , సంగీత దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.;
మల్టీ టాలెంటెడ్ స్టార్ శృతి హాసన్ నటిగానే కాదు. అద్భుతమైన గాయనిగా , సంగీత దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఆమె తన బాల్యంలో జరిగిన ఒక మరపురాని సంఘటనను గుర్తు చేసుకుంది. భారతీయ సంగీత సామ్రాజ్ఞి, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే ముందు మొదటిసారి పాడాల్సి వచ్చినప్పుడు తాను ఎంతలా భయపడిపోయింది అన్న దానిపై శృతి హాసన్ ఆక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆశా భోంస్లే భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక శిఖరం. అటువంటి మహోన్నత వ్యక్తి ముందు నిలబడి పాడటం అంటే ఏ గాయనికైనా ఒక పరీక్ష లాంటిదే.
శృతి హాసన్ చిన్న వయస్సులో నే రికార్డింగ్ సెషన్‌లో ఆశాజీని కలవాల్సి వచ్చింది. `ఆమె ఒక లెజెండ్.. ఆమె ముందు నిలబడటమే ఒక పెద్ద విషయం. ఇక పాడటం అంటే మామూలు విషయం కాదు` అని శృతి ఆనాటి ఉత్కంఠను గుర్తు చేసుకున్నారు. ఆ రికార్డింగ్ సమయంలో ఆశా భోంస్లే తన ముందే కూర్చుని ఉండటంతో శృతి విపరీతమైన ఒత్తిడికి లోనయ్యానంది. ఎంతలా అంటే? పాట పాడటానికి మైక్ పట్టుకున్నప్పుడు కాళ్లు, చేతులు వణకడం మొదలయ్యాయంది. గొంతులోంచి స్వరం కూడా సరిగ్గా రానంత భయం ఆమెను ఆవహించింది. ఒక పక్క తండ్రి కమల్ హాసన్, మరోపక్క ఆశా భోంస్లే వంటి సంగీత సరస్వతి ఉండటంతో ఆ చిన్నారి శృతికి అది ఒక పెద్ద సవాలుగా మారింది.
ఆ సమయంలో ఆశా భోంస్లే తనలోని భయాన్ని గమనించి ఎంతో ఆప్యాయంగా పలకరించారని శృతి తెలిపారు. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం, చూపిన ఆదరణ వల్ల మెల్లమెల్లగా తన ఒత్తిడి తగ్గిందని, ఆ తర్వాతే పాటను పూర్తి చేయగలిగానని పూర్కొంది. గొప్ప కళాకారిణికి ఉండాల్సిన లక్షణం కేవలం ప్రతిభే కాదు. తోటి కళాకారులను, ముఖ్యంగా వర్ధమాన నటులను ప్రోత్సహించడం కూడా అని ఆ రోజు తనకు అర్థమైందని శృతి వివరించారు.ఈ సంఘటన శృతి హాసన్ జీవితంలో ఒక బలమైన ప్రభావాన్ని చూపింది. ఆ రోజు పొందిన ఒత్తిడి , భయమే ఆమెను సంగీతం పట్ల మరింత అంకితభావంతో పనిచేసేలా ప్రేరేపించింది.
నేడు అంతర్జాతీయ వేదికలపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ ఆశాజీ ముందు పాడిన ఆ పది నిమిషాల ఒత్తిడిని తాను ఎప్పటికీ మర్చిపోలేనని శ్రుతి చెబుతుంటారు. పెద్దల పట్ల ఉండే గౌరవం, కళ పట్ల ఉండే భక్తి ఆ వణుకులో దాగి ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. వారసత్వం ఉన్నప్పటికీ స్వయంకృషితో ఎదిగిన శృతి హాసన్ తన ఎదుగుదల వెనుక ఇలాంటి ఎన్నో భావోద్వేగపూరితమైన జ్ఞాపకాలు ఉన్నాయని చాటిచెప్పారు. లెజెండ్స్ ముందు మోకరిల్లడం ద్వారానే గొప్ప విషయాలు నేర్చుకోగలమని ఆమె మాటలు నిరూపిస్తున్నాయి. ఈ చిన్నప్పటి అనుభవం శ్రుతి హాసన్ ని ఒక పరిణతి చెందిన కళాకారిణిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.