ఫామ్ లో ఉన్న హీరో- లైమ్ లైట్ లో లేని డైరెక్టర్.. వర్కవుట్ అయ్యేనా?
ఒకప్పుడు వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న ఆయన, కొన్ని సినిమాలుగా అస్సలు లైమ్ లైట్ లో లేకుండా పోయారు.;
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో శ్రీను వైట్ల కూడా ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. కానీ కొంత కాలంగా శ్రీను వైట్ల అసలు ఫామ్ లో లేరు. ఒకప్పుడు వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న ఆయన, కొన్ని సినిమాలుగా అస్సలు లైమ్ లైట్ లో లేకుండా పోయారు. గత కొన్నేళ్లుగా ఆయనకు సరైన హీరోలు, నిర్మాతలు దొరక్క ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.
విశ్వంతో ఫ్లాప్
మంచు విష్ణుతో ఢీ కి సీక్వెల్ చేద్దామనుకుంటే అది వర్కవుట్ అవలేదు. ఆఖరికి గోపీచంద్ హీరోగా విశ్వం అనే సినిమా చేశారు కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక ఫెయిలైంది. విశ్వం సినిమా ఫ్లావడంతో మళ్లీ ఆయన కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఏదొక సినిమా చేయాలని ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ సినిమా మాత్రం కుదరడం లేదు.
శర్వాతో శ్రీను వైట్ల సినిమా
అయితే ఇప్పుడు అన్ని ఇబ్బందులను ఎదుర్కొని శ్రీను వైట్ల తన తర్వాతి సినిమాను ఫిక్స్ చేసుకున్నారు. ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల తన తర్వాతి సినిమాను చేయబోతున్నారు. నారీ నారీ సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని స్వయంగా శర్వానే అనౌన్స్ చేశారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్
విశ్వం మూవీ తర్వాత శ్రీను వైట్ల పలువురు హీరోలను కలిసి కథలు చెప్పారు. వారిలో నితిన్ తో సినిమా అని ఆ మధ్యన వార్తలొచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని, శ్రీను వైట్ల తర్వాత డైరెక్ట్ చేయబోయే శర్వానే అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుండగా, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుందనే విషయాన్ని కూడా శర్వా స్టేజ్ పై అనౌన్స్ చేశారు. సంక్రాంతి సీజన్ తనకు బాగా కలిసొచ్చిందని, అందుకే ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తామని చెప్పిన శర్వాకు అస్సలు ఫామ్‌లో లేని శ్రీను వైట్ల ఎలాంటి సినిమాను ఇస్తారో చూడాలి.