ఇండియా మొత్తం గర్వపడే సినిమా తీశాం.. 'బైకర్' ఈవెంట్‌లో శర్వానంద్
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'బైకర్' సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.;
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'బైకర్' సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. లేటెస్ట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బన్నీ వాసు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. గతంలో తాను 'నారీ నారీ నడుమ మురారి' అని చెప్పి హిట్ కొట్టానని, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నానని, ఈ 'బైకర్' తో బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా మొత్తం మాట్లాడుకునే ఒక గొప్ప సినిమాను తీశామని శర్వా ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో శర్వానంద్ తండ్రి పాత్రలో నటిస్తున్న యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తనకు ఈ కథ బాగా నచ్చిందని, సెకండ్ హీరో పాత్ర అయినా సరే అడ్జస్ట్ అయిపోయి చేస్తున్నానని చెప్పారు. "నా కోసం మంచి క్యారెక్టర్లు ఉంటే తీసుకురండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ ఇతర దర్శకులకు విజ్ఞప్తి చేశారు. శర్వానంద్, యూవీ క్రియేషన్స్ తనను ఒక హీరోలాగే గౌరవించారని, ఈ సినిమాలో ఉండే ఎమోషన్ అందరినీ కదిలిస్తుందని రాజశేఖర్ పేర్కొన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ డైరెక్టర్ అభిలాష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తను అనుకున్న పాయింట్‌ను స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశాడని, ముఖ్యంగా విజువల్స్ రేసింగ్ సీన్లు హై రేంజ్ లో ఉన్నాయని మెచ్చుకున్నారు. శర్వానంద్ మేకోవర్ చూసి తాను షాక్ అయ్యానని, రాజశేఖర్ గారు ఒక కోచ్‌గా, తండ్రిగా ఈ సినిమాలో ప్రాణం పోశారని చెప్పారు. ఏప్రిల్ 3న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ సినిమా మేకింగ్ గురించి కొన్ని వివరాలు షేర్ చేసుకున్నారు. ఈ కథ 1990, 2000 కాలానికి సంబంధించిన రెండు వేర్వేరు టైమ్ లైన్స్‌లో సాగుతుందని, ఆ కాలం నాటి బైక్స్ వాతావరణాన్ని రీ క్రియేట్ చేయడం కోసం చాలా కష్టపడ్డామని చెప్పారు. కేవలం రేసింగ్ మాత్రమే కాకుండా, ప్రతి రేసు వెనుక ఒక బలమైన ఎమోషన్ ఉంటుందని, అదే ఈ సినిమాకు ప్రాణమని వివరించారు. శర్వానంద్ తన పాత్ర కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారని, ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతారని అభిలాష్ తెలిపారు.
బన్నీ వాసు, మాళవిక నాయర్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. యూవీ క్రియేషన్స్ అంటే తన సొంత సంస్థ లాంటిదని, ఈ సినిమా సెకండ్ హాఫ్ చూసిన తన మిత్రులు అదిరిపోయిందని చెప్పారని బన్నీ వాసు వెల్లడించారు. ఇక మాళవిక నాయర్ మాట్లాడుతూ.. రాజశేఖర్ గారితో కలిసి పనిచేయడం ఒక మంచి అనుభవమని, ట్రైలర్‌లో చూసింది కొంచెమేనని, సినిమాలో ఇంకా చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, డీఓపీ యువరాజ్ కూడా సినిమా అవుట్‌పుట్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.
ఇక 'బైకర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సినిమాపై ఉన్న హైప్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఇండియాలోనే ఫస్ట్ టైమ్ మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉందని మేకర్స్ మాటలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా సౌండ్ డిజైన్ ఆర్ఆర్ గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే పాజిటివ్ చర్చ జరుగుతోంది. ఇక ఏప్రిల్ 3న ఈ రేసింగ్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.