స్టార్ హీరో సినిమా ఆపాలంటూ లేడీ గ్యాంగ్‌స్టర్ నోటీస్
ఓ రోమియో చిత్రం కథాంశం ఆసక్తికరం. 1980లలో ముంబై అండర్ వరల్డ్‌లో గ్యాంగ్ స్టర్ హుస్సేన్ ఉస్తారా సుప్రసిద్ధుడు.;
`అర్జున్ రెడ్డి` రీమేక్ కబీర్ సింగ్ లో వైవిధ్యమైన రగ్ డ్ పాత్రలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో మెప్పించాడు షాహిద్ కపూర్. ఆ సినిమాలో హింసాత్మకమైన డ్రగ్ అడిక్ట్ గా, భయంకర ప్రేమికుడిగా అతడు జీవించాడు. ఇప్పుడు మరో వైవిధ్యమైన చిత్రంలో అతడు నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన `ఓ రోమియో` పోస్టర్ లో షాహిద్ లుక్ దీనిని చెబుతోంది. అతడు నటిస్తున్న `ఓ రోమియో` పోస్టర్లు చూడగానే ఇది కూడా యానిమల్, మార్కో చిత్రాల తరహాలో రక్తపాతం, క్రూరత్వం, సైకోపాథిక్ అంశాలతో రూపొందుతోందా? అనే సందేహాలు కలిగాయి. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఈ చిత్రానికి సంబంధించి ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబర్ షేక్ చిత్రనిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు.
సనోబర్ షేక్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా, దర్శకుడు విశాల్ భరద్వాజ్‌లకు నోటీసులు పంపారు. ఈ సినిమా తన తండ్రి హుస్సేన్ ఉస్తారా జీవిత కథ ఆధారంగా రూపొందుతోందని, అయితే అందులో తన తండ్రిని ప్రతికూల కోణంలో చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గానూ రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు లేదా తమ అభ్యంతరాలను పరిశీలించి సంబంధిత సన్నివేశాలను తొలగించే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని సనోబర్ సేక్ కోరారు.
అసలు కథకు స్ఫూర్తి:
ఓ రోమియో చిత్రం కథాంశం ఆసక్తికరం. 1980లలో ముంబై అండర్ వరల్డ్‌లో గ్యాంగ్ స్టర్ హుస్సేన్ ఉస్తారా సుప్రసిద్ధుడు. అయితే అతడికి సప్నా దీదీ అనే మహిళా గ్యాంగ్ స్టర్ తో విభేధాలుండేవి. ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా వర్సెస్ సప్నా దీదీ రివెంజ్ డ్రామాను సినిమాగా తీస్తున్నారని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఆ రోజుల్లో నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. జనవరి 10న విడుదలైన టీజర్‌లో నిజ ఘటనల స్పూర్తితో అనే డిస్‌క్లైమర్ ఉండటంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది.
ఇంకా స్పందించలేదు:
గ్యాంగ్ స్టర్ డ్రామా మేకర్స్ ఇంకా ఉస్తారా నోటీసుపై అధికారికంగా స్పందించలేదు. సినిమా విడుదలకు కేవలం నెల రోజులే సమయం ఉండటంతో, కోర్టు ద్వారా ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. సాధారణంగా ఇలాంటి బయోపిక్ లు, రియల్ లైఫ్ స్ఫూర్తితో తీసే సినిమాలకు లీగల్ చిక్కులు ఎదురవ్వడం బాలీవుడ్‌లో సర్వసాధారణం.కానీ సమస్యను పరిష్కరించుకుని ముందుకు వెళ్లడానికి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
కమీనే, హైదర్, రంగూన్ తర్వాత షాహిద్ - విశాల్ భరద్వాజ్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రమిది. షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి, విక్రాంత్ మాస్సే, నానా పటేకర్, తమన్నా భాటియా, దిశా పటాని, అవినాష్ తివారీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది.