అతిపెద్ద క్లాష్ లో బాక్సాఫీస్ కింగ్

ముఖ్యంగా విదేశాల్లో షారుఖ్ కు ఉన్న మార్కెట్ ను ఈ హాలీవుడ్ సినిమాలు దెబ్బతీసే అవకాశం ఉంది. అటు అవెంజర్స్ సిరీస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.;

Update: 2026-01-25 06:00 GMT

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం 'కింగ్' రిలీజ్ డేట్‌ను ఇటీవల అనౌన్స్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు. ఆ లుక్ కి ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ రిలీజ్ డేట్ వెనుక ఒక భారీ రిస్క్ దాగి ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. షారుఖ్ మార్కెట్ స్టామినా ఎంత ఉన్నా.. ఈసారి ఆయన ఎదుర్కోబోయే క్లాష్ మాత్రం మామూలుగా లేదు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీస్ అవెంజర్స్: డూమ్స్‌డే, డూన్ 3 తో తలపడాల్సి ఉంటుంది. ఈ రెండు హాలీవుడ్ చిత్రాలు సరిగ్గా ఒక వారం ముందు అంటే డిసెంబర్ 18న విడుదల కాబోతున్నాయి. సాధారణంగా షారుఖ్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ లోనూ.. ఇండియాలోని మల్టీప్లెక్సుల్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. కానీ హాలీవుడ్ భారీ చిత్రాలు అదే సమయంలో బరిలో ఉండటం వల్ల థియేటర్ల కేటాయింపు.. షోల కౌంట్ పై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది.

ముఖ్యంగా విదేశాల్లో షారుఖ్ కు ఉన్న మార్కెట్ ను ఈ హాలీవుడ్ సినిమాలు దెబ్బతీసే అవకాశం ఉంది. అటు అవెంజర్స్ సిరీస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి గ్లోబల్ సినిమాల మధ్యలో 'కింగ్' తన మార్కెట్ ను ఎలా కాపాడుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ట్రేడ్ పండితులు ఈ రిలీజ్ డేట్ విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా.. షారుఖ్ టీమ్ మాత్రం తమ కంటెంట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ లుక్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. టీజర్‌లో కనిపించిన ఆయన రఫ్ అండ్ టఫ్ మేకోవర్.. ఆ హై వోల్టేజ్ మూడ్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. షారుఖ్ కెరీర్‌లోనే ఇది ఒక మాస్ అటెంప్ట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన కూతురు సుహానా ఖాన్ తో కలిసి షారుఖ్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.

ఈ సినిమాలో షారుఖ్ ఒక పవర్‌ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. సుజయ్ ఘోష్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా.. సిద్ధార్థ్ ఆనంద్ తన మార్క్ యాక్షన్ హంగులను అద్దుతున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు షూటింగ్ పనులను పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ పోరులో 'కింగ్' గెలిచి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుతారో లేదో చూడాలి.

Tags:    

Similar News