వాళ్లలా పైర్ బ్రాండ్ కి బెంచ్ మార్క్ సాధ్యమేనా?
నర్సు పాత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రఖ్యాత నటి వహీదా రెహ్మాన్. 1969 లో రిలీజ్ అయిన `కామోషీ`చిత్రంలో వహీదా నర్సుగా చేసిన నటన భారతీయ సినీ చరిత్రలో ఓ మైలురాయి.;
నర్సు పాత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రఖ్యాత నటి వహీదా రెహ్మాన్. 1969 లో రిలీజ్ అయిన `కామోషీ`చిత్రంలో వహీదా నర్సుగా చేసిన నటన భారతీయ సినీ చరిత్రలో ఓ మైలురాయి. మానసిక రోగులకు సేవ చేస్తూ, వారి పట్ల అనురాగం చూపే నర్సుగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఈ చిత్రం తర్వాతే బాలీవుడ్‌లో నర్సు పాత్రలకు ప్రత్యేకమైన గౌరవం, డిమాండ్, గుర్తింపు దక్కాయని చెప్పొచ్చు.ఆ తర్వాత తరం హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ `గుజారిష్` చిత్రంలో పోషించిన నర్సు పాత్ర సోఫియా డిసౌజా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
పక్షవాతంతో బాధపడే కథానాయకుడికి నిరంతరం తోడుగా ఉండే నర్సుగా ఐశ్వర్య అద్భుతమైన నటనను కనబరిచారు. ఆమె గ్లామర్‌ను పక్కన పెట్టి కళ్లతోనే భావాలను పలికించి పాత్రకు నిండుదనాన్ని తీసుకొచ్చారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నర్సుల వృత్తిలోని సహనాన్ని అంకితభావాన్ని గొప్పగా చూపించింది. అలాగే కరీనా కపూర్ కూడా `క్యూన్ కీ` చిత్రంలో నర్సు పాత్రను పోషించారు. మానసిక ఆసుపత్రి నేపథ్యంలో సాగే ఈ కథలో రోగి పట్ల ప్రేమను పెంచుకునే నర్సుగా కరీనా తన నటనతో ఆకట్టుకున్నారు.
అనంతరం కత్రినా కైఫ్ `యబ్ తక్ హై జాన్` చిత్రంలోనూ కొద్దిసేపు నర్సుగా సేవలందిస్తున్న దృశ్యాల్లో కనిపిస్తారు. ఇంకా పాత తరం నటీమణులు నూతన్, వైజయంతిమాల వంటి వారు కూడా సామాజిక స్పృహ ఉన్న కథల్లో నర్సుల పాత్రలకు ప్రాణం పోశారు. అయితే కొంత కాలంగా ఆ తరహా పాత్రలు పెద్దగా పుట్టడం లేదు. కానీసం కామెడీ ప్రయత్నాల్లో కూడా నర్సు పాత్రలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నర్సు పాత్రలో మెప్పించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కంగన `భారత భాగ్య విధాత` అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో కంగన నర్సు పాత్రలోనే కనిపించనున్నారు. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఓ ఆసుపత్రిలో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఉగ్రవాదుల అధీనంలో ఉన్న ఆసుపత్రి అందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారందర్నీ వైద్య సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించారు? అన్నది చూపించడమే ఇతి వృత్తంగా తెరకెక్కిస్తున్నారు. ఆ సన్నివేశాలు, ఎమోషన్ ని హైలైట్ చేస్తూ మనోజ్ తపాడియా తెరకెక్కిస్తున్నారు. మరి నర్సు పాత్రలో కంగన ఎలా అలరిస్తుందో చూడాలి. ప్రయోగాల విషయంలో కంగన వెనకాడే నటి కాదు. రిస్క్ ను సైతం రస్క్ తీసుకున్నంత ఈజీగా తీసుకుంటుంది. అందుకే బాలీవుడ్ హీరోయిన్లు అందరిలో కంగన స్పెషల్ గా నిలిచింది.