పవన్ డూప్ గా హరీష్.. అసలు నిజమేంటి?

దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమవుతోంది.;

Update: 2026-03-12 13:30 GMT

దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్ల వేగం పెంచిన దర్శకుడు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అనేక విషయాలను ఆయన వెల్లడిస్తున్నారు. తాజాగా గతంలో వచ్చిన కొన్ని రూమర్లపై స్పందించారు.

సినిమా ప్రీ లుక్ పోస్టర్ విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ పోస్టర్‌ లో హీరోను వెనక నుంచి మాత్రమే చూపించారు. ఖాకీ డ్రెస్‌ లో కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఫోటో ఉండటంతో, అందులో ఉన్నది నిజంగా పవనేనా? లేక హరీష్ శంకరే డూప్‌ గా నటించారా? అనే డౌట్స్ మొదలయ్యాయి. కొంతమంది అయితే అది పవన్ కాదని, హరీష్ నటించారని ఫిక్సయ్యారు.

తర్వాత టీజర్ విడుదలైనప్పటికీ ఆ చర్చ ఆగలేదు. కొంతమంది ప్రేక్షకులు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, కొన్ని బ్యాక్ షాట్స్‌ లో హరీష్ శంకర్ కనిపించారని అనుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ స్పష్టతనిచ్చారు. ఆ రూమర్ల గురించి మాట్లాడిన ఆయన.. ఇప్పటివరకు తాను పవన్ కు డూప్‌ గా నటించలేదని స్పష్టం చేశారు. ప్రీ లుక్ పోస్టర్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు చూసి బాధపడలేదని చెప్పారు.

పవన్ తో తనను పోల్చడం ఆనందంగా అనిపించిందని తెలిపారు. స్టార్ హీరోలా ఉన్నాడని అనుకుంటే అది సంతోషమేనని అన్నారు. అలాగే ఇండస్ట్రీలో బాడీ డూప్స్ ఎందుకు ఉపయోగిస్తారనే విషయంపై వివరించారు. షూటింగ్ సమయంలో హీరోలు చాలా సార్లు ప్రమాదకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తుందని చెప్పారు. అలాంటి సందర్భాల్లో చిన్న గాయం అయినా షూటింగ్ షెడ్యూల్ మొత్తం మారిపోతుందని తెలిపారు.

దీనివల్ల నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం కలగవచ్చని అన్నారు. అందుకే ముఖ్యంగా రిస్క్ ఎక్కువగా ఉండే యాక్షన్ సన్నివేశాల్లో బాడీ డూప్స్‌ను ఉపయోగించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇది హీరోల భద్రత కోసం కూడా అవసరమని, నిర్మాతలు అదే దృష్టితో నిర్ణయం తీసుకుంటారని వివరించారు. మొత్తానికి.. పవన్ డూప్ గా హరీష్ శంకర్ నటించారన్న విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లైంది.

ఇక సినిమా విషయానికొస్తే.. గతంలో గబ్బర్ సింగ్ తో భారీ విజయాన్ని అందుకున్న పవన్- హరీష్ కాంబినేషన్ మళ్లీ రిపీటవ్వడంతో ఉస్తాద్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ సరసన హీరోయిన్లుగా శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పవన్ స్టైల్ యాక్షన్, హరీష్ శంకర్ మాస్ టేకింగ్‌ తో రూపొందుతున్న ఆ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News