ఆ గాయకుడి ప్రయాణం నవతరానికో స్పూర్తి!
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అర్జిత్ సింగ్ ఓ తిరుగులేని ధ్రువతార. తన గాత్రంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఈ గాయకుడి ప్రయాణం అంత సులభంగా సాగలేదు.;
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అర్జిత్ సింగ్ ఓ తిరుగులేని ధ్రువతార. తన గాత్రంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఈ గాయకుడి ప్రయాణం అంత సులభంగా సాగలేదు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నేడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుడిగా ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన నేపథ్యం, ఎదుగుదల నవతరానికి ఎంతో స్పూర్తిగా నిలుస్తుంది. అర్జిత్ సింగ్‌కు సంగీతం అనేది రక్తంలోనే ఉంది. ఆయన తల్లి నాట్య కళాకారిణి, గాయని.
మేనమామ తబలా విద్వాంసుడు. అలా చిన్నప్పటి నుండే ఇంట్లో సంగీత వాతావరణం ఉంటంతో అర్జిత్ తన ముగ్గురు గురువుల (హజారీ సోదరులు) వద్ద భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. చిన్న వయసులోనే ఆయనలోని ప్రతిభను గుర్తించిన గురువులు, అర్జిత్ ను కేవలం ఒక ప్రాంతీయ గాయకుడిగానే కాకుండా జాతీయ స్థాయికి చేరాలని నిరంతరం ప్రోత్సహించారు.అర్జిత్ సింగ్ పేరు మొదటి సారిగా 2005లో 'ఫేమ్ గురుకుల్' అనే రియాలిటీ షో ద్వారా దేశవ్యాప్తంగా వినబడింది. ఆ షోలో ఆయన అద్భుతంగా పాడినప్పటికీ, ఫైనల్‌లో ఓడిపోయి ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఓటమి ఆయనను కుంగదీయలేదు. పైగా ముంబై వంటి నగరంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలను పెంచింది.
ఆ తర్వాత మరో రియాలిటీ షోలో గెలిచినప్పటికీ, ఆయనకు వెంటనే గాయకుడిగా అవకాశాలు రాలేదు. సంగీత దర్శకుడిగా ఎదగాలనే లక్ష్యంతో అర్జిత్ సింగ్ కొంతకాలం మ్యూజిక్ ప్రోగ్రామర్‌గా పని చేశారు. ప్రీతమ్, విశాల్-శేఖర్ , మిథూన్ వంటి అగ్ర సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా ఉంటూ పాటలను ఎలా కంపోజ్ చేయాలో? నేర్చుకున్నారు. ఈ కాలంలోనే ఆయన గొంతులోని ప్రత్యేకతను ప్రీతమ్ గుర్తించారు. 2011లో రిలీజ్ అయిన `మర్డర్ 2` చిత్రంలోని 'ఫిర్ మొహబ్బత్' పాటతో గాయకుడిగా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అదే అర్జిత్ సింగ్ కెరీర్‌కు పునాది వేసింది.
అనంతరం అర్జిత్ సింగ్ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం `ఆషికి 2`. అందులోని `తుమ్ హీ హో` పాట దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఈ ఒక్క పాటతో అర్జిత్ రాత్రికి రాత్రే సూపర్ స్టార్‌గా మారిపోయారు. అప్పటి నుండి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. `కబీరా`, `చన్నా మేరేయా`, `కేసరియాస`వంటి వందలాది సూపర్ హిట్ పాటలతో ప్రతి ప్రేమికుడి గొంతుకగా మారారు. భావోద్వేగాలను పలికించడంలో అతడి శైలి మిగతా గాయకుల నుంచి వేరు చేసింది. ఇంతటి కీర్తి ప్రతిష్టలు గడించినా, అర్జిత్ సింగ్ వ్యక్తిత్వం మాత్రం చాలా సాధారణంగా ఉంటుంది. కోట్లు సంపాదిస్తున్నా ఇప్పటికీ ఒక సామాన్యుడిలా తన గ్రామంలో తిరుగుతాడు. పాత స్కూటర్ పై వెళ్లడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. స్టార్ హోదా తలకెక్కించుకోకుండా కేవలం సంగీతాన్ని ప్రేమిస్తూ నిరాడంబరంగా జీవించే అర్జిత్ సింగ్ ప్రయాణం కష్టపడి పైకి రావాలనుకునే ప్రతి యువ కళాకారుడికి ఒక గొప్ప పాఠంగా చెప్పొచ్చు.