ఆగస్ట్ తీర్చని కలలను సెప్టెంబర్ నెరవేరుస్తుందా?
భారతదేశంలోని మూవీ లవర్స్ అందరూ ఆగస్ట్ 14పై ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆ ఆశలన్నీ నిరాశగానే మిగిలాయి.;
భారతదేశంలోని మూవీ లవర్స్ అందరూ ఆగస్ట్ 14పై ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆ ఆశలన్నీ నిరాశగానే మిగిలాయి. భారీ బడ్జెట్ తో పాటూ భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన వార్2, కూలీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసి సంచలనాలు సృష్టిస్తాయనుకుంటే ఆ సినిమాలు ప్రేక్షకుల అంచాలను అందుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాలకూ ఓపెనింగ్స్ బాగా వచ్చినప్పటికీ యునానిమస్ టాక్ మాత్రం రాలేదు.
ఇండిపెండెన్స్ వీక్ కారణంతో కొంచెం స్ట్రాంగ్ కలెక్షన్లు కనిపిస్తున్నాయి కానీ తర్వాత ఈ రెండు సినిమాలకూ భారీ డ్రాప్స్ తప్పవని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఆగస్టులో అనుపమ పరమేశ్వరన్ పరదా, సత్యరాజ్ త్రిబాణధారి బార్బరిక్ తప్పించి చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ఈ రెండు సినిమాలూ ఒకేరోజున ఆగస్ట్ 22న రిలీజ్ కానున్నాయి. దీంతో ఆగస్ట్ అయిపోతుంది.
సెప్టెంబర్ 5న ఘాటీ, మిరాయ్
ఇక సెప్టెంబర్ విషయానికొస్తే పలు క్రేజీ సినిమాలతో సెప్టెంబర్ నెల ముస్తాబై ఉంది. అందలో మొదటిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ఘాటీ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అదే రోజున హను మాన్ ఫేమ్ తేజ సజ్జ భారీ బడ్జెట్ సినిమా మిరాయ్ కూడా రిలీజవుతోంది.
ఆ తర్వాత వారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి అనే హార్రర్ డ్రామా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 19న విజయ్ ఆంటోనీ డబ్బింగ్ మూవీ భద్రకాళి రిలీజ్ కానుండగా, ఆ తర్వాత వారం సెప్టెంబర్ 25న రెండు భారీ సినిమాలు పోటీ పడనున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి సినిమాతో పాటూ బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ2 కూడా ఒకేరోజున రిలీజ్ కానున్నాయి. అయితే ఈ రెండింటిలో అఖండ2 వాయిదా పడే అవకాశాలున్నట్టు వార్తలొస్తుండగా ఓజి మాత్రం తప్పకుండా చెప్పిన డేట్ కే వస్తుందంటున్నారు. మొత్తానికి సెప్టెంబర్ నెల మొత్తం ప్రతీ వారం ఏదొక కొత్త సినిమా రిలీజవుతూనే ఉండనుందన్నమాట. మరి ఆగస్ట్ నెల మిగిల్చిన నిరాశను సెప్టెంబర్ అయినా భర్తీ చేస్తుందేమో చూడాలి.