సీనియర్ హీరోల కొత్త ఫార్ములా ఇదేనా?
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే ముందుగా హీరో ఇమేజ్, ఆయనకు సరిపోయే కథ, భారీ సెట్స్, మాస్ ఎలిమెంట్స్ గురించే డిస్కషన్ జరిగేది.
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే ముందుగా హీరో ఇమేజ్, ఆయనకు సరిపోయే కథ, భారీ సెట్స్, మాస్ ఎలిమెంట్స్ గురించే డిస్కషన్ జరిగేది. డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ అయినా, స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాను మలచాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోల కెరీర్‌లో డైరెక్టర్ ఎంపికే అత్యంత కీలక నిర్ణయంగా మారుతోంది.
ఆడియన్స్ టేస్ట్ మారడం, ఓటీటీ ఇంపాక్ట్ పెరగడం, పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడం వంటి పరిణామాలు స్టార్ సినిమాలపై కొత్త ఒత్తిడిని తీసుకొచ్చాయి. కేవలం హీరో స్టార్‌డమ్‌తో ఓపెనింగ్స్ రావచ్చు కానీ సినిమా సక్సెస్ కావాలంటే ఆడియన్స్ ను రెండున్నర గంటలు థియేటర్‌లో కూర్చోబెట్టే స్ట్రాంగ్ విజన్ అవసరం. అందుకే ఇప్పుడు పెద్ద హీరోలు కూడా దర్శకుడి కథనం, మేకింగ్ స్టైల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే డిస్కషన్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకనాయకుడు కమల్‌హాసన్, టాలెంటెడ్ డైరెక్టర్ S.U అరుణ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయనుండటం ఆసక్తిని కలిగిస్తోంది.
రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ల కెరీర్‌లను పరిశీలిస్తే ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే తరహా సినిమాలను వరుసగా చేయడం కంటే, తమ ఇమేజ్‌కు కొత్త కోణాన్ని చూపించగల డైరెక్టర్ల కోసం వారు చూస్తున్నారు. కొందరు కమర్షియల్ డైరెక్టర్లతో భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంచుకుంటే, మరికొందరు కొత్త తరహా కథలను చెప్పగల ఫిల్మ్‌మేకర్లకు అవకాశం ఇస్తున్నారు.
ఇక్కడ అసలు సవాల్ స్టార్‌కు తగ్గ సినిమా చేయడం కాదు. స్టార్‌ను కొత్తగా చూపిస్తూనే ఆయన ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా ఉండటం. ఇదే డైరెక్టర్ ముందున్న పెద్ద పరీక్ష. ఒకవైపు స్టార్ ఇమేజ్‌ను కాపాడాలి, మరోవైపు ప్రేక్షకుడికి గతంలో చూడని అనుభూతిని ఇవ్వాలి. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించిన డైరెక్టరే ఇప్పుడు స్టార్ హీరో కెరీర్‌ను కొత్త దశకు తీసుకెళ్లగలుగుతున్నాడు.
అందుకే సీనియర్ హీరోల విషయంలో ఇప్పుడు ప్రశ్న ఎవరితో సినిమా చేస్తున్నారు? అనే దగ్గరే ఆగిపోవడం లేదు. ఆ డైరెక్టర్ ఆ స్టార్‌ను ఎలా చూపించబోతున్నారు? అనేదే మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఫ్యూచర్ లో స్టార్ పవర్ కంటే డైరెక్టర్ విజన్ బాక్సాఫీస్ రిజల్ట్ ను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. సీనియర్ స్టార్‌లకు ఇప్పుడు సరైన డైరెక్టర్ ను ఎంచుకోవడమే అసలు గేమ్‌గా మారుతోందనేది మాత్రం స్పష్టమవుతుంది.