3 రోజెస్ సీజన్ 2... బెట్టింగ్ భోగి ఎంట్రీతో ఫన్ వేరే లెవెల్!
3 రోజెస్ సీక్వెల్ లో కమెడియన్ సత్య భాగమైనట్లు తెలిపారు. బెట్టింగ్ సత్యగా నటించనున్నట్లు అనౌన్స్ చేశారు.;
టాలీవుడ్ హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా, పూర్ణ మెయిన్ రోల్స్ లో నటించిన 3 రోజెస్.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2021లో రిలీజ్ అయిన 3 రోజెస్ సిరీస్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సిరీస్ కు యూత్ బాగా అట్రాక్ట్ అయిపోయారు.
ఇప్పుడు 3 రోజెస్ సీజన్ 2 రానున్న సంగతి విదితమే. సీజన్ 2కు రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా.. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే అనౌన్స్మెంట్ టీజర్ ను ఉమెన్స్ డే సందర్భంగా మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేయగా.. అందరినీ ఆకట్టుకుంది.
పంచ్ డైలాగ్ లతో ఉన్న గ్లింప్స్.. నవ్వించింది. అయితే అనౌన్స్మెంట్ టీజర్ తో సీజన్ సీక్వెల్ పై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్. హర్ష, ఈషా రెబ్బ అనౌన్స్మెంట్ టీజర్ లో కనిపించగా.. సీక్వెల్ లో పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ఉండరని అర్థమవుతోంది. అదే సమయంలో ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు.
3 రోజెస్ సీక్వెల్ లో కమెడియన్ సత్య భాగమైనట్లు తెలిపారు. బెట్టింగ్ సత్యగా నటించనున్నట్లు అనౌన్స్ చేశారు. సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన ఆయన.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. సీజన్ 2లో సత్య ఉండడంతో కామెడీ మరో మలుపు తిరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు
ఐపీఎల్ మ్యూజిక్ తో స్టార్ట్ అయిన గ్లింప్స్ తో సత్యను పరిచయం చేశారు మేకర్స్. అతడు ఐపీఎల్ మ్యాచుల్లో బెట్టింగ్స్ వేస్తుంటాడు. బెట్టింగ్ వద్దని అందరూ చెబుతున్నా.. తనదైన రీతిలో బెట్స్ కాస్తుంటారు. కొన్ని మ్యాచ్ ల తర్వాత రూ.10 లక్షలు నష్టపోతారు. దీంతో అందరినీ డబ్బులు అడుగుతుంటారు. ఏదో మ్యాజిక్ చేయాలని అంటుంటారు.
గ్లింప్స్ బట్టి సత్య మంచి కామెడీ అందించనున్నారని క్లియర్ గా తెలుస్తోంది. సీజన్ 2పై అంచనాలు కూడా పెరుగుతున్నాయని చెప్పాలి. మొత్తానికి సరైన నటుడిని రంగంలోకి దించారు మేకర్స్. ప్రస్తుతం గ్లింప్స్ వైరల్ గా మారి.. అందరినీ మెప్పిస్తోంది. కాగా, సీజన్ లో వైవా హర్ష, కుషిత కల్లపు సహా పలువురు నటిస్తున్నారు. మరి సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో వేచి చూడాలి.