'ధురంధర్' విజయ ప్రస్థానం: తెరవెనుక సైన్యానికి రాయల్టీ ఏదీ?
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద `ధురంధర్: ది రివెంజ్` సృష్టిస్తున్న బాక్సాఫీస్ ప్రభంజనం భారతీయ సినిమా గమనాన్ని మారుస్తోంది.;
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద `ధురంధర్: ది రివెంజ్` సృష్టిస్తున్న బాక్సాఫీస్ ప్రభంజనం భారతీయ సినిమా గమనాన్ని మారుస్తోంది. ఈ భారీ విజయం నేపథ్యంలో చిత్ర కథానాయిక సారా అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. సాధారణంగా ప్రేక్షకులు తెరపై కనిపించే నటీనటుల గ్లామర్‌ను మాత్రమే చూస్తారు.. కానీ ఈ సినిమా వెనుక ఉన్న వందలాది మంది టెక్నీషియన్ల శ్రమను నటి సారా అర్జున్ ప్రత్యేకంగా కొనియాడారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ను మొదటిసారి కలిసినప్పుడే ఆయన భారతీయ సినిమాలో ఏదో ఒక అద్భుతం చేయబోతున్నారని తనకు అనిపించిందని.. ఈ `ధురంధర్` ఫ్రాంఛైజీతో అది నిజమైందని పేర్కొన్నారు.
సినిమా షూటింగ్ సమయంలో ప్రతి చిన్న విషయంలో టీమ్ చూపిన శ్రద్ధ ప్రాజెక్ట్ విజన్ విషయలో ఉన్న స్పష్టత ఈ అసాధారణ విజయానికి పునాది అని చెప్పవచ్చు. లైట్ మెన్ల నుండి సౌండ్ ఇంజనీర్ల వరకు పేరు తెలియని ప్రతి ఒక్క గుర్తింపుకు నోచుకోని తెరవెనక హీరోల శ్రమను సారా ఈ విజయానికి అంకితం చేశారు. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ , స్టంట్ క్రూ, ప్రొడక్షన్ డిజైనర్లు అహోరాత్రులు పడిన కష్టాన్ని సారా తన నోట్‌లో విడమర్చి చెప్పారు. నటీనటులు కేవలం పోస్టర్లపై మాత్రమే కనిపిస్తారని.. కానీ సినిమాకు అసలైన వెన్నెముక సాంకేతిక నిపుణులేనని ప్రశంసించారు. ఈ పోస్ట్‌పై స్పందించిన నటి యామీ గౌతమ్ ధర్ కూడా సారాను ``ప్రస్తుతంలోను, భవిష్యత్తును ఏలే నటి`` అని ప్రశంసించడం విశేషం.
అయితే సారా ప్రశంసలు సరే కానీ.. ఒక సినిమా సాధించే భారీ ప్రాచుర్యం.. ఆర్థిక ప్రయోజనాలు సాంకేతిక నిపుణులకు ఏ మేరకు అందుతున్నాయనేది ఒక చర్చనీయాంశం. సామాన్య ప్రేక్షకులు సినిమాను కేవలం హీరో లేదా హీరోయిన్ ముఖచిత్రంగానే చూస్తారు కాబట్టి.. విజయం దక్కినప్పుడు వచ్చే క్రెడిట్ ఎక్కువగా నటీనటులకే వెళ్తుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎడిటర్లు, సినిమాటోగ్రాఫర్ల గురించి కొంత చర్చ జరుగుతున్నా.. అది కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతోంది. నటీనటుల స్థాయిలో సాంకేతిక నిపుణులకు గుర్తింపు రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ముఖ్యంగా భారతీయ సినీపరిశ్రమలో రచయితలకు కూడా గుర్తింపు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆర్థిక కోణంలో చూస్తే.. తారలతో పోలిస్తే సాంకేతిక నిపుణుల పారితోషికాల విషయంలో తీవ్రమైన వ్యత్యాసాలు కనిపిస్తాయి. సినిమా బడ్జెట్‌లో సింహభాగం నటీనటులకే కేటాయించడం ఇటీవల చూస్తున్నాం. ఒక తెలుగు సినిమాకి సగం బడ్జెట్ కేవలం స్టార్ హీరోకే కేటాయించడం చూస్తున్నాం. పైగా వారు లాభాల్లో వాటాలు కూడా అందుకుంటారు. కానీ తెరవెనుక ఉండే పెద్ద టెక్నీషియన్లను మినహాయిస్తే.. ఇతర క్రాఫ్టులలో అధికంగా శ్రమించే లైట్ మెన్, సెట్ అసిస్టెంట్స్ వంటి కింది స్థాయి టెక్నీషియన్లకు కేవలం నిర్ణీత వేతనం మాత్రమే లభిస్తుంది. ధురంధర్ వంటి చిత్రం రూ. 1000 కోట్లు వసూలు చేసినా క్షేత్రస్థాయిలో చెమటోడ్చిన కార్మికుల ఆర్థిక స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ మార్పు రాదు. ఈ అసమానతలు పరిశ్రమలోని శ్రమ విభజనలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నాయి.
పరిశ్రమలో మార్పులు మొదలైన మాట వాస్తవమే. రాజమౌళి, ప్రశాంత్ నీల్, ఏ.ఆర్. రెహమాన్ వంటి దిగ్గజాల వల్ల అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులకు ఇప్పుడు ఒక `బ్రాండ్ ఇమేజ్` వస్తోంది. కానీ ఈ గుర్తింపు కింది స్థాయి వరకు చేరాల్సి ఉంది. సినిమా విజయం సాధించినప్పుడు అది కేవలం కొద్దిమందికి మాత్రమే కాకుండా.. ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి గౌరవాన్ని, మెరుగైన పారితోషికాన్ని అందించినప్పుడే `ధురంధర్` వంటి చిత్రాలు సాధించిన విజయానికి నిజమైన అర్థం లభిస్తుంది. టెక్నీషియన్లకు అందాల్సిన పారితోషికం, గుర్తింపు మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సారా అర్జున్ గుర్తించినట్టే సినీపరిశ్రమల్లోని అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా తెరవెనక హీరోలను గుర్తించి వారికి ఆర్థిక స్వావలంభన సాధించుకునేలా సహకరించడం చాలా అవసరం.