'సంతాన ప్రాప్తిరస్తు'కు అదే పెద్ద అచీవ్‌మెంట్.. డైరెక్టర్ ఏమన్నారంటే?
ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని, దానికి వినోదాన్ని జోడించి సినిమాగా తీయడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే.;
ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని, దానికి వినోదాన్ని జోడించి సినిమాగా తీయడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఈ వారం విడుదలైన 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమా టీమ్ కూడా అలాంటి ఒక ప్రయత్నమే చేసింది. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమా విడుదలైన తర్వాత, టీమ్ 'సక్సెస్ సెలబ్రేషన్స్' మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడారు.
తాము ఒక సెన్సిటివ్ పాయింట్ తీసుకుని, దానికి హ్యూమర్ ని జోడించి ఒక సినిమాగా మలిచామని దర్శకుడు తెలిపారు. ఒక ఫిల్మ్‌మేకర్‌గా తనకు లభించిన అతిపెద్ద బహుమతి ఏమిటో ఆయన వివరించారు. "మొత్తం కుటుంబం కలిసి కూర్చుని సినిమాను ఆస్వాదించవచ్చు" అని ప్రేక్షకులు, విమర్శకులు చెప్పడమే తనకు దక్కిన పెద్ద రివార్డ్ అని ఆయన అన్నారు.
ఈ సినిమా సక్సెస్ మీట్‌లో సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. విమర్శకుల నుంచి వస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. "ప్రతీ ఒక్క రివ్యూయర్ ఒకే మాటను ఏకగ్రీవంగా ప్రస్తావిస్తున్నారు. ఒక సెన్సిటివ్ ఇష్యూని ఎక్కడా వల్గారిటీ లేకుండా, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసేలా తీశారు అని అందరూ అంటున్నారు" అని ఆయన తెలిపారు.
ఇది తమ చిత్ర బృందానికి ఒక పెద్ద అచీవ్‌మెంట్ అని, ఇది ఏమాత్రం చిన్న విషయం కాదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి వస్తున్న ఈ ప్రేమ, ఆదరణ చూసి చాలా ఆనందంగా ఉందని అన్నారు.
థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీకి ప్రేక్షకులు పడి పడి నవ్వుతున్నారని, అలాగే తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం కామెడీ ట్రాకులు కూడా బాగా పేలాయని అన్నారు. సినిమాలోని హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ గురించి కూడా రివ్యూయర్లు చాలా బాగా రాశారని సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు.
"మేము ఒక కాన్సెప్ట్‌తో ముందుకు వస్తే, దానికి సపోర్ట్ చేయడానికి మీడియా వారు మేము ఉన్నారు అని మరోసారి నిరూపించారు" అంటూ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల నుంచి వస్తున్న ఈ పాజిటివ్ రెస్పాన్స్, సినిమాకు "ఫెంటాస్టిక్ ఫన్ ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్" టాక్‌ను తెచ్చిపెట్టిందని టీమ్ సంతోషం వ్యక్తం చేస్తోంది.