సంక్రాంతికి సీనియర్ హీరోల మధ్య వార్!
మరోవైపు నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ కూడా సంక్రాంతి రేసులోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.;
2027 సంక్రాంతి సీజన్ రిలీజ్ డేట్లపై అప్పుడే కర్చీప్ వేయడం మొదలైంది. సినిమా ప్రారంభానికి ముందే సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్టర్లు వేసి మరీ డేట్లు లాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలు కూడా ఎక్కడా తగ్గడం లేదనిపిస్తోంది. ఒకరికొకరు పోటీగా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోసారి సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున దశాబ్దాల తర్వాత ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నలుగురు దిగ్గజాలు తమ ప్రాజెక్టులతో పొంగల్ బెర్తులు ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే..
వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రంమిది. ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి విజయాల తర్వాత వస్తోన్న చిత్రమిది. ఇందులో కల్యాణ్ రామ్ కూడా ఓ హీరోగా నటిస్తుండటంతో మల్టీస్టారర్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే జనవరి 15ని విడుదల తేదీగా ప్రకటించారు. ఆరకంగా సంక్రాంతి రేసులో తాము ముందే ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ అనిల్ రావిపూడి మార్కు వినోదంతో ఈ చిత్రం రాబోతుండటం వెంకటేష్‌కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సెంటిమెంట్‌ను రిపీట్ చేసేందుకు సిద్ధమయ్యారు. బాబి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న కొత్త సినిమాను సంక్రాంతి కానుకగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సంక్రాంతి విజేతగా నిలవడంతో, ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మాస్ ఎలిమెంట్లతో కూడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం చెప్పొచ్చు.
మరోవైపు నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ కూడా సంక్రాంతి రేసులోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. వీరిద్దరి గత చిత్రం వీరసింహారెడ్డి సంక్రాంతికి విడుదలై బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. దీంతో మరోసారి అదే మాస్ కాంబో రిపీట్ అవుతుండటంతో థియేటర్ల వద్ద పోటీ రసవత్తరంగా మారనుంది. బాలయ్య మార్కు డైలాగులు, గోపీచంద్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. అలాగే కింగ్ నాగార్జున కూడా సరైన కథతో రేసులో నిలుస్తున్నారు. 101వ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇలా ఈ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద నలుగురు సీనియర్ల మధ్య క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ తప్పదనిపిస్తుంది
ఒకే సీజన్‌లో నలుగురు సీనియర్ హీరోలు రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగానే ఉంటాయి. కానీ థియేటర్ల సర్దుబాటు అనేది పెద్ద సవాలుగా మారుతుంది. అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగే పోటీ మరోస్థాయిలో ఉంటుంది. అభిమానుల మధ్య వైరాలకు ఇలాంటి పోటా పోటీ రిలీజ్ లు కల్పిస్తుంటాయి.