సంక్రాంతి 'టికెట్' ట్విస్ట్.. పరిస్థితి ఎలా ఉండబోతోంది?

రాబోయే 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండనున్నట్లు అర్థమవుతోంది.;

Update: 2025-12-24 13:30 GMT

రాబోయే 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఒకవైపు ప్రభాస్, చిరంజీవి వంటి అగ్ర హీరోలు, మరోవైపు రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి వంటి మిడ్ రేంజ్ హీరోలు బరిలో దిగుతున్నారు. అయితే ఈసారి పోటీ కేవలం కంటెంట్ పరంగానే కాదు, టికెట్ రేట్ల విషయంలోనూ ఆసక్తికరంగా మారింది. పెద్ద సినిమాలు టికెట్ హైక్స్ కోసం చూస్తుంటే, చిన్న హీరోలు మాత్రం రెగ్యులర్ ప్రైజులకే మొగ్గు చూపుతున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద సినిమాలకు అసలైన షాక్ ఇచ్చేలా ఉంది.

ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్', చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినవి. కాబట్టి ఈ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు అనేది అవసరమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుంచి వీరు స్పెషల్ పర్మిషన్లు, రేట్ల పెంపు కోరుకుంటున్నారు. సంక్రాంతి సీజన్ కాబట్టి ఫ్యాన్స్ ఎంత రేటైనా పెట్టి చూస్తారు అనేది నిర్మాతల నమ్మకం. కానీ సామాన్య ప్రేక్షకుల పరిస్థితి వేరు.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' చిత్రాలు రెగ్యులర్ టికెట్ రేట్లకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వస్తోంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాలకు వెళ్లడం ఆనవాయితీ. ఐదుగురు కలిసి సినిమాకు వెళ్లాలంటే, టికెట్ రేట్లు తక్కువగా ఉండటమే సేఫ్. ఈ సింపుల్ లాజిక్ ని పట్టుకునే ఈ ముగ్గురు హీరోలు సేఫ్ గేమ్ ఆడుతున్నారు.

పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే, ఆ భారం సామాన్యుడి జేబు మీద పడుతుంది. అదే సమయంలో పక్కన తక్కువ రేటుకే మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందంటే ఆడియెన్స్ అటువైపే మళ్లే ఛాన్స్ ఎక్కువ. ముఖ్యంగా శర్వా, నవీన్, రవితేజ సినిమాలు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్లు కాబట్టి, మధ్యతరగతి ఫ్యామిలీస్ కి ఇవే ఫస్ట్ ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ పెద్ద సినిమాలకు ఏమాత్రం మిక్స్డ్ టాక్ వచ్చినా, ఆ ప్రభావం టికెట్ రేట్ల వల్ల రెట్టింపు అవుతుంది. అదే టైమ్ లో చిన్న సినిమాలకు గనక పాజిటివ్ టాక్, మంచి మౌత్ టాక్ వస్తే మాత్రం, తక్కువ టికెట్ రేటు అనే అస్త్రంతో అవి బాక్సాఫీస్ ను కొల్లగొట్టేస్తాయి. గతంలో కూడా ఇలాంటి స్ట్రాటజీతో చిన్న సినిమాలు సంక్రాంతి విన్నర్లుగా నిలిచిన చరిత్ర ఉంది.

ఏదేమైనా స్టార్ హీరోలు ఓపెనింగ్స్, హైక్స్ మీద ఆధారపడితే.. యంగ్ హీరోలు మాత్రం అందుబాటు ధరలు, కంటెంట్ మీద నమ్మకం పెట్టుకున్నారు. టికెట్ రేటు తగ్గించి సామాన్యుడికి దగ్గరవ్వాలనే ఈ స్ట్రాటజీ వర్కవుట్ అయితే మాత్రం, సంక్రాంతికి అసలైన విన్నర్లు వీళ్ళే అవుతారు. మరి ఈ టికెట్ వార్ లో చివరికి ఎవరు గెలుస్తారో చూడాలి.

Tags:    

Similar News